కొల్లాపూర్ : అంబేద్కర్ (Ambedkar) లాంటి మహనీయుల చరిత్ర, వారి రచనలు, సిద్ధాంతాలు, ఆశయాల గురించి తెలిపే గ్రంథాల కోసం ప్రతీ గ్రామానికి లక్ష రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తానని సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) హామీనిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన కొల్లాపూర్( Kollapur ) పట్టణం, పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామం, చిన్నంబావి మండల కేంద్రంతో పాటు చిన్న దగడ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను మంత్రి జూపల్లి స్మరించుకున్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాన్ని పాటించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి, అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారన్నారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు.
అంబేద్కర్ సూచించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని తెలిపారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని, గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. రూ. 5 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 2 కోట్లను గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి కేటాయించనున్నట్లు ప్రకటించారు.
ప్రతి గ్రామానికి లక్ష రూపాయల చొప్పున గ్రంథాలయాల అభివృద్ధికి మొత్తం రూ. కోటి, ప్రతి గ్రామానికి లక్ష రూపాయల క్రీడల అభివృద్ధికి రూ. 1 కోటి కేటాయించనున్నట్లు వెల్లడించారు. మహాత్మా గాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి ఫూలే వంటి మహానుభావుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు వారు సాధించిన విజయాలను తెలిపే పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.