కుభీర్ : ప్రభుత్వ బడుల్లో ( Government Schools) కనీస సౌకర్యాలు కల్పించేందుకు తమ సంస్ధ కృషి చేస్తోందని గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ ( Kadari Naresh ) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ (Kubheer) మండలం నిగ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 30 వేలు విలువచేసే శుద్ధ జల యంత్రం, సోనారిలోని ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 15 వేలు విలువచేసే స్మార్ట్ టీవీని టెంటమాస్ మెగాసన్ సంస్థ, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలల ఉపాధ్యాయులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సైతం సౌకర్యాలను కల్పించాలని సదుద్దేశంతో మండలంలో చాలా పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు. తమ సంస్థ ద్వారా వృద్ధులు, అర్హత ఉండి ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేని విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎంఈవో విజయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, విద్యార్థులకు ఉపయోగపడే బ్యాగులు, శుద్ధ జల యంత్రాలు అందిస్తున్న జీఎస్ఎఫ్ సంస్థ సేవలు మరువలేనివని అన్నారు. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు చైర్మన్ కడారి నరేష్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆర్.విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు వినోద్ కుమార్, సురేష్, ఫౌండేషన్ సభ్యులు జి.రాజేశ్వర్, నాగభూషణ్, దత్తాద్రి, రోహిత్ ధర్మసేన, సాయికృష్ణ, మాజీ సర్పంచ్ గుంచెట్టి రాజు, మాజీ ఎంపీటీసీ దేవిదాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.