జూలూరుపాడు, మే 11 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించి పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా జూలూరుపాడు మండలంలోని దండుమిట్ట తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ. 2 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాలుర మరుగుదొడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి గుంత తవ్వి పనులను ప్రారంభించడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అక్కడి నుండి పాపకొల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ చేపట్టనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. ఇదే క్రమంలో పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని పూజితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, క్రమశిక్షణతో చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని హితబోధ చేశారు. అనంతరం జూలూరుపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని ఆయన ప్రారంభించగా, అక్కడ విద్యార్థులకు మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, క్రీడలు మరియు యోగా వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వివరించారు.
శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీస్తూ, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు కళలు, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా వికాసం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విద్యా వారోత్సవాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో అజయ్, ఎంఈఓ జుంకీలాల్, ఎస్ ఓ పద్మజ, సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, ప్రధానోపాధ్యాయులు ఎస్కే మీరా సాహెబ్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్