ఔషధాల్లేని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఊహించలేం. ఔషధ కల్పన శాస్ర్తాన్ని ఆంగ్లంలో ‘ఫార్మసీ’ అని, ఫార్మసీ నిపుణుడిని ‘ఫార్మసిస్ట్’ అని అంటారు. ఫార్మసిస్టును ‘అపోతెకరీ’ అని కూడా వ్యవహరిస్తారు. ‘అపోతెకరీ’లు ఔషధ కల్పనతో పాటు, చికిత్స సేవలందించేవారు. ఇప్పటికీ ఫార్మసిస్టులు చాలా దేశాల్లో ఉభయ విధులు నిర్వర్తిస్తున్నారు. మొదట ఫిజీషియన్లే ఫార్మసిస్టులు, ఫార్మసిస్టులే ఫిజీషియన్లు. వైద్య విధానాలెన్ని ఉన్నా అల్లోపతి ప్రధాన స్రవంతి విధానంగా నిలిచింది.
అల్లోపతి వైద్యం యురోపియన్ వలసలతో మన దేశంలోకి ప్రవేశించింది. సాధారణ తలనొప్పి నుంచి క్లిష్టమైన వ్యాధుల దాకా అల్లోపతి మందులనే ఆశ్రయిస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ రంగానికి ఔషధాలే మూలాధారం. ముడి ద్రవ్యాల నుంచి ఔషధాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలుకొని, పరిశోధన, పంపిణీ, వితరణ వంటి సమస్త ఔషధీయ వ్యవహర్తలు ఫార్మసిస్టులు. కొవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో ఉన్న ఔషధాల్లో పనికివచ్చే ఔషధాల ఎంపిక, వాటి అధికోత్పత్తి, కొత్త ఔషధాలు వ్యాక్సిన్ల పరిశోధన, ఉత్పత్తి అంతా ఫార్మసిస్టుల కృషి ఫలితమే.
వైద్యవిద్యతో సమానమైన ఫార్మసీని న్యూనతతో చూస్తున్నందువల్ల ఫార్మసిస్టులు నష్టపోతున్నారు. పరోక్షంగా ప్రజారోగ్యరం గం కుంటుపడుతున్నది. వారి పర్యవేక్షణ లేకుండా ఔషధ వినియోగం జరిగితే అనేక ఔషధ జనిత అవాంతరాలతో పాటు, ప్రజ ల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతున్నది.
ప్రజారోగ్య ప్రాముఖ్యం దృష్ట్యా ఫార్మసీ రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఫార్మసిస్టుల స్వయం ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలె. సామాజిక భద్రత పథకాల్లో చోటు కల్పించాలె. ప్రాథమిక చికిత్సకులుగా ప్రకటించాలె. పీహెచ్సీలలో 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా వారి సంఖ్యను పెంచాలె. అన్ని ఆరోగ్య పథకాల్లో ఫార్మసిస్టులను నియమించి భాగస్వాములను చేయాలె. ఆసక్తి గల ఫార్మసిస్టులను హెల్త్ ఎడ్యుకేటర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, హెల్త్ ప్రోగ్రాం మానిటర్స్‌గా తీసుకోవాలె. డ్రగ్ కంట్రోల్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా ఇతర శాఖాధికారుల జోక్యం ఉండకూడదు.
ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్-1 సర్వీసెస్ పరీక్షల్లో ఫార్మసీ సబ్జెక్టును చేర్చాలె. జాతీయ ఆరోగ్య విధాన రూపకల్పనలో ఫార్మసిస్టులకు ప్రాతినిధ్యం ఉండాలె. ఆరోగ్య రంగంలో విధాన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వం ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ను సంప్రదిస్తున్నట్లుగానే, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలె. అప్పుడే ఫార్మసిస్ట్‌ల విజ్ఞానాన్ని ఆరోగ్య సంరక్షణా రంగం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది.
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
94401 63211
(వ్యాసకర్త: ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)