తమ బాధ్యతారాహిత్యం ఎంత ప్రమాదకరంగా మారుతున్నదో, దాని దుష్ట భావాలు చివరకు తమపైనే ఏ విధంగా ఉంచవచ్చునో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారైనా ఆలోచిస్తున్నదా? సమస్యలపై రాజీలేని తనం వేరు, విచక్షణా రహిత ప్రవర్తన వేరు. సమస్యలపై రాజీలేని తనాన్ని ప్రజలు మెచ్చుతారు. కానీ విచక్షణా రాహిత్యాన్ని హర్షించలేరు. అది తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించినా, ప్రజలు వాస్తవాలను గ్రహించినకొద్దీ బీజేపీకే ఎదురు తిరుగుతుంది. జాతీయ స్థాయిలో పరిపాలన నెరపుతూ దేశానికి మార్గదర్శకత్వం వహించవలసిన పార్టీ అధికారం కోసం తమ రాష్ట్రశాఖను ఇట్లా సంకుచితంగా ప్రోత్సహించటం ఇందుకు పరాకాష్ఠ అవుతున్నది.
ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ తీరు అభ్యంతరకరంగా ఉన్నది. ఏదో ఒక విధంగా ఆయా వర్గాలను రెచ్చగొట్టటం, ఓట్లు సంపాదించటం అనే ఏకైక సంకుచిత ప్రయోజనం తప్ప, తమ వాదనలలో వాస్తవాలు ఏమిటి? డిమాండ్లలో హేతుబద్ధత ఎంత అనే ఆలోచన ఏమైనా ఉందా? వాస్తవాలతో నిమిత్తం లేకుండా కల్లబొల్లి మాటలు చెప్పి, నిర్హేతుకమైన ఆశలను పురికొల్పి, ప్రభుత్వం చేస్తున్న వాటికి మసిబూసి.. రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాలను రెచ్చగొట్టటం కష్టం కాదు. కాని వారు అప్పుడప్పుడు ఎదురయ్యే కొన్ని సమస్యల నుంచి, అందువల్ల కలిగే దుఃఖంనుంచి తేరుకున్న తర్వాత వాస్తవాలను గ్రహిస్తారు. ఉదాహరణకు ధాన్యం దిగుబడి లోగడ ఏ పార్టీ పాలనలో కూడా ఇంతగాలేదు. వ్యవసాయం కోసం ఇంత కృషి ఎవరూ చేయలేదు. రైతులనుంచి ఆహారధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోళ్లనూ లోగడ ఎవరూ చేపట్టలేదు. ఇదంతా తెలంగాణ రైతుకు పూర్తిగా తెలిసిన విషయమే. ధాన్య సేకరణకు కేంద్రం సహకరించటం లేదన్నది కూడా వారికి తెలుసు. కాని చివరి దశలో చిన్న సమస్య వచ్చింది. అది రైతుకు బాధ కలిగించింది. అందుకు కారణం రాష్ట్రప్రభుత్వం కాదని వారికి తెలుసు. తమ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినంతగా ఎప్పుడూ ఎవరూ చేయలేదని తెలుసు. కాని తాత్కాలికంగా కొందరికి చిన్న సమస్య ఎదురైన మాట కూడా నిజమే కావటం బీజేపీకి కలసి వచ్చింది. వారి అసత్య ప్రచారం కొద్దికాలం పనిచేసింది. చివరికి తేలిపోయింది. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ అదే జరుగుతుంది.
ఇదంతా ఆలోచనా పరులందరికీ, ఆయా వర్గాల వారికి అర్థమవుతున్నదే. నిజానికి బీజేపీ నాయకత్వంతో అసలు సమస్య అది కాదు. కేంద్రంతో పాటు పలు రాష్ర్టాలలో పాలిస్తున్న ఈ పార్టీ తన ఈ విధమైన వ్యవహరణ ద్వారా, దేశ రాజకీయాలలో, పరిపాలనలో ఎటువంటి బాధ్యతాయుతమైన సంస్కృతిని, సంప్రదాయాలను పెంపొందిస్తున్నది? భారత జాతీయతలో, రాజకీయ సంప్రదాయంలో, పరిపాలనాపరమైన సత్సంస్కృతిలో ఈ విధమైన మార్పు లు అవసరమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నదా? లేక మిగిలిన అన్ని పార్టీలను పడగొట్టి తాము అధికారాన్ని చేజిక్కించుకోవటం, తర్వాత యధేచ్చగా పాలించటమే తాము ప్రవచించే కొత్త రాజకీయ సంస్కృతి, రామరాజ్య సంప్రదాయం, భారత జాతీయతగా ఆదర్శం అవుతాయని చెప్పదలచుకుందా? లోగడ జనసంఘ్ రూపంలో, తర్వాత బీజేపీగా కేంద్రంలో, రాష్ర్టాలలో సుదీర్ఘమైన పాలనానుభవం గల ఈ పార్టీ, దేశానికి కొత్తగా చూపిన రాజకీయ విలువలు ఏమిటి? పరిపాలనా సంస్కృతి ఏమిటి? అధికార సాధనకోసం ఎత్తుగడలలో, నైతిక పతనాలలో వీరు ఎవరికీ తీసిపోరు? ఇతర పార్టీలకు మీరు ‘ప్రతిరూపాలు’ కావాలా లేక ‘ప్రత్యామ్నాయమా’ అని ఒకప్పుడు ఎంతో అట్టహాసపు ఆకర్షణీయమైన నినాదాన్ని ఇచ్చింది ఈ పార్టీ నాయకత్వం. ఇప్పుడు కొద్దికాలం తిరిగే సరికే తాము కేవలం ప్రతిరూపంగా మిగిలినట్లు బహిరంగంగా అంగీకరించింది.
ప్రస్తుత బీజేపీ మరుగుజ్జు నాయకత్వాలు వివిధ ఉపాయాలతో అధికారాలు సంపాదించితే సంపాదించవచ్చు గాని, దేశాన్ని ప్రత్యామ్నాయ మహోన్నత భారతీయ ప్రజాస్వామిక విలువలలోకి మాత్రం తీసుకు వెళ్లలేవు. అంతే కాదు, ఇటువంటి ధోరణులను రెచ్చగొట్టితే తాము ఒకవేళ అధికారానికి వస్తే తమకే అవి ఎదురు తిరగగలవు.
అప్పటి నుంచి, ప్రత్యామ్నాయ విలువల మాట తిరిగి ఎప్పుడూ ఎత్తలేదు. అది కూడా నిజాయితీయే. అందుకు వారిని మెచ్చుకోవాలి. కాని మరొక వైపు భారతదేశపు రాజకీయ విలువల పతనాన్ని, విషాదాన్ని మాత్రం యథాశక్తి పెంచుతూనే ఉన్నారు. అధికారకాంక్ష, ధనార్జనాకాంక్ష పెరిగేకొద్దీ పతనమవుతు న్నారు. గమనించదగినదేమంటే.., ఇటువంటి పతన ప్రణాళికకు సాధనాలుగా ఉపయోగపడే వారినే రాష్ట్రపార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా నియమించే ధోరణి ఒకటి వాజపేయి, అద్వానీల అనంతర కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రత్యామ్నాయ విలువల గురించి ఆ ఇద్దరు మహానాయకుల కాలంలో మాట్లాడి నప్పటికీ పార్టీలోని ఇతర శక్తుల కారణంగా నెరవేరలేదు. వారి అనంతరం అసలు ఆ ప్రస్తావనలే లేవు. ప్రస్తుత మరుగుజ్జు నాయకత్వాలు వివిధ ఉపాయాలతో అధికారాలు సంపాదించితే సంపాదించవచ్చు గాని, దేశాన్ని ప్రత్యామ్నాయ మహోన్నత భారతీయ ప్రజాస్వామిక విలువలలోకి మాత్రం తీసుకు వెళ్లలేవు. అంతే కాదు, ఇటువంటి ధోరణులను రెచ్చగొట్టితే తాము ఒకవేళ అధికారానికి వస్తే తమకే అవి ఎదురు తిరగగలవు.
తెలంగాణ బీజేపీ నాయకత్వపు రాజకీయ ఎత్తుగడలు, సంప్రదాయం కూడా ఇదే విధంగా, పరమ చవకబారుగా రూపుదిద్దుకొని సాగటం నిజానికి సహజమైన విషయం. అయితే, తెలంగాణ ప్రజల సుదీర్ఘ సంప్రదాయాలు ఇందుకు భిన్నమైనవి. వారికి గల వేల సంవత్సరాల ఘర్షణలు, చైతన్యాల సంప్రదాయాలు ఈ కపట ధోరణులను చిత్తుచేయగలవు.
టంకశాల అశోక్
98481 91767