e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ధాన్య ప్రణాళిక కేంద్రం బాధ్యత

ధాన్య ప్రణాళిక కేంద్రం బాధ్యత

రాజ్యాంగం ఫెడరల్‌గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటలు, ఆహారభద్రత, ధాన్య సేకరణ, పంపిణీ విధానాలు కూడా అందులోకి వస్తాయి. ఈ విషయాల్లో కేంద్రం, రాష్ర్టాల మధ్య అవగాహన, సమన్వయం అవసరం.కానీ అందుకు చొరవ తీసుకోవలసిన కేంద్రం విఫలమైందన్నది స్పష్టం.

దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే ఎందుకు సమస్య కావాలని బీజేపీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద కూడా అదే సమస్య ఉందని కొన్ని ఇతర రాష్ర్టాల సభ్యులు పార్లమెంటులో చెప్పలేదా? సేకరణ సమస్యలు ఆహారధాన్యాలతో పాటు ఇతర పంటలకు ఎదురవటం లేదా? కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్యలు మరెన్ని పంటలకు ఎన్నెన్ని రాష్ర్టాల్లో ఏర్పడటం లేదు? గతేడాది కాలంగా ఉత్తర భారత రైతాంగం సాగిస్తున్న ఆందోళన మాటేమిటి?

- Advertisement -

ఒక దేశంలోని ప్రజలకు అన్నింటికన్న ప్రధానమైనది ఆహార భద్రత, స్వయం సమృద్ధి. అందుకు కావలసిన విధంగా వ్యవసాయరంగాన్ని, ధాన్య సేకరణను, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవటం. అది లేనందున వలసపాలనా కాలంలో తరచు కరవు కాటకాలను, వేలకు వేల ఆకలిచావులను చూసిన నాయకత్వం, స్వాతంత్య్రానంతరం క్రమంగా ఆ స్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇంకా సమగ్రంగా నెరవేరలేదు. ఉదాహరణకు, దేశం మొత్తమ్మీద కలిపి చూసినపుడు ధాన్యం దిగుబడి అయితే గణనీయంగా పెరిగింది. తలకు ఒక్కంటికి ఎంత ధాన్యం అవసరమనే లెక్కలు వేసినప్పుడు ఆ దిగుబడి అందరికీ చాలినంత మేర ఉంది. కానీ వాస్తవ స్థితిని గమనించినప్పుడు ఒకవైపు ఆకలితో, అర్ధాకలి తో మాడుతున్నవారు కోట్లలో ఉండగా, మరొకవైపు రైతుకు గిట్టుబాటు ధర లభించని స్థితి ఉండగా, ఇంకొక వైపు ప్రభుత్వ ఆహార సంస్థ గిడ్డంగులలో లక్షల టన్నుల ధాన్యం ముక్కిపోతుంటుంది. దీనిని నిపుణులు ఎత్తిచూపటమే గాక, కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బలవంతంగా ఉచిత పంపిణీ చేయించవలసి వచ్చింది. ఇంకొక ముఖ్యమైన ఉదాహరణను చెప్పాలం టే, ఇప్పటికీ మనకు వంట నూనెలు, పప్పు దినుసులలో స్వయం సమృద్ధి లేదు.

ఈ ఉదాహరణలలో కన్పించేదేమిటి? ఈ సువిశాల దేశంలో భూమికి, నీటికి, కష్టించే రైతులకు కొరత లేదు. కానీ రాష్ర్టాలతో కలిసి సమన్వయ పూర్వకంగా, సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికలు, ధాన్యసేకరణ, నిల్వలు, పంపిణీలకు పూనుకొనే కేంద్ర ప్రభుత్వాలు లేకపోయాయి. ఫలితంగా రైతులు, వినియోగదా రులు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండు బాగుం టే రెండింటికి కొరత. ఒక సీజన్‌లో బాగుంటే మరొక సీజన్‌లో కొరతలు. దేశానికంతటికీ కలిపి రాష్ర్టాలతో పాటు ప్రణాళికలు రచించి, ఉమ్మడిగా అమలు పరచవలసిన కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటైనా సవ్యంగా, ఒక దార్శనికతతో, ఒక ప్రణాళిక ప్రకారం, దేశంలోని వనరులను సరిగా వినియోగించుకుంటూ, రాష్ర్టాలతో ఫెడరలిస్టు సమన్వయ సహకారాలను చూపుతూ అమలు పరచకపోవటం ఈ అస్తవ్యస్తతలకు, సమస్యలకు మూలకారణం. ఈ పనిచేయని కేంద్ర ప్రభుత్వాలు పెద్ద వ్యాపారులకు, మధ్య దళారులకు, బ్లాక్‌ మార్కెటీర్లకు ఎగుమతి దిగుమతి దారులకు, కార్పొరేట్లకు, విత్తనాలూ ఎరువులూ మందుల కంపెనీలకు, మల్టీ నేషనల్స్‌కు కనక వర్షం కురిపించే పనులు మాత్రం తు.చ. తప్పకుండా అమలుపరుస్తుంటుంది. ప్రస్తుత సమస్యతో నిమిత్తం లేకుండా కూడా ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ చెప్పి హెచ్చరిస్తున్నదే.

నిజమైన అర్థంలో ఫెడరలిస్టు ధర్మాన్ని వ్యవసాయం, ఆహారం విషయంలో అనుసరిస్తే ఇటువంటి సమస్యలేవీ ఉండవని కేంద్రంలోని పెద్దలకు తెలియనిది కాదు. అటువంటిది ఉండినట్లయితే, తెలంగాణ రైతు నుంచి ధాన్య సేకరణ అనే సమస్య తలెత్తేదే కాదు. దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే ఎందుకు సమస్య కావాలని బీజేపీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద కూడా అదే సమస్య ఉందని ఇతర రాష్ర్టాల సభ్యులు కొందరు పార్లమెంటులో చెప్పలేదా? సేకరణ సమస్యలు ఆహారధాన్యాలతో పాటు ఇతర పంటలకు ఎదురవటం లేదా? కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్యలు మరెన్ని పంటలకు ఎన్నెన్ని రాష్ర్టాల్లో ఏర్పడటం లేదు? గతేడాది కాలంగా ఉత్తర భారత రైతాంగం సాగిస్తున్న ఆందోళన మాటేమిటి?

తమది ‘సహకార ఫెడరలిస్టు మార్గ’మని అధికారానికి వచ్చిన కొత్తలోనే స్వయంగా, సగర్వంగా చాటిచెప్పిన కేంద్ర నాయకత్వం, అటువంటి స్పృహను ఆచరణలో ఇప్పుడింత సమస్యగా మారిన వ్యవసాయం విషయంలో ఎప్పుడైనా చూపిందా? రాష్ర్టాలతో చర్చించరు, రైతులతో మాట్లాడరు, నిపుణులు చెప్పేది వినరు, గత అనుభవాలను లెక్కచేయరు, సమగ్రమైన దార్శనికతలు, ప్రణాళికలు ఉండవు. ధాన్యం సేకరణపై తెలంగాణతో, వివిధ వ్యవసాయ అంశాలపై ఉత్తర భారత రైతాంగంతో సాగుతున్న ఈ వివాదాలు నిజానికి మొత్తం దేశంలో ఉన్న సమస్యలు. కేంద్ర విధానాలలో గల ఒక మౌలిక వ్యాధి లక్షణాలు ఇవన్నీ. వీటినుంచి పాఠాలు నేర్చుకొని పద్ధతులు మార్చుకోక పోయినట్లయితే సమస్య మున్ముందు ఇంకా తీవ్రం కాగలదు.

టంకశాల అశోక్‌
98481 91767

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement