మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రంగం ‘రుణాలు’. మన్మోహన్ హయాం కన్నా అనేక రెట్లు అప్పులు పెరిగాయి. ఇవి ఏటా పెరుగుతున్నవి. రుణగ్రస్థ భారత్‌గా దేశం మిగిలిపోయింది. ఈ అప్పుల వల్ల దేశం మౌలిక వనరుల పరంగానో, అభివృద్ధి పరంగానో ఏమైనా సాధించిందా అంటే
అది కూడా లేదు.
2014లో మోదీ అధికారం చేపట్టే నాటికి దేశ ఆర్థికరంగం 8 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2015లో బ్యారెల్ ధర 110 డాలర్లు కాగా.. 2017 నాటికి అది 50 డాలర్లకు పడిపోయింది. చమురు కొనుగోళ్ల మీద మిగిలే మొత్తాన్ని కూడా పన్నులు పెంచటం ద్వారా ప్రభుత్వం ఖజానాకే మళ్లించుకున్నది. అయినప్పటికీ 2019 నాటికి జీడీపీ వృద్ధిరేటు 4 శాతానికి పడిపోయింది. దీనికి కారణం.. మోదీ అపసవ్య ఆర్థిక విధానాలు. 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా ప్రకటించిన నోట్ల రద్దు ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. మరుసటి ఏడాది జూలైలో ఆదరబాదరగా తీసుకొచ్చిన జీఎస్టీ మరింత దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీన్ని సరిదిద్దుకోవటానికి అప్పుల మీద అప్పులు చేయాల్సిన పరిస్థితి.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 62 శాతం అప్పులున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించింది. ఇది 152 లక్షల కోట్లకు సమానం. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలను పరిశీలిస్తే రుణాలు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలుస్తుంది. 2021లో రుణాలు/ జీడీపీ నిష్పత్తి 60.5 శాతం, 2020లో ఇది 51.6 శాతం. అంటే ఎప్పటికప్పుడు రుణభారం పెరుగుతూనే ఉన్నది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతున్నదా అంటే అదీ లేదు. యూపీఏ హయాంలో అత్యధికంగా దేశ ఆర్థికవ్యవస్థ 8 శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. నేడు అది 6 శాతానికి పడిపోయింది. ఒక దశలోనైతే (2019-20లో) ఏకంగా 4 శాతానికి పతనమైంది.
ఆర్థిక గ్రాఫ్ ఈ విధంగా పడిపోవటానికి కరోనా కారణం అని ప్రభుత్వం చెప్తున్నది. నిజమే.. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వాల సామర్థ్యానికి కరోనా ఒక పెద్ద పరీక్ష పెట్టింది. అటువంటి సంక్షోభంలోనూ ప్రజలను సమస్యల నుంచి తప్పించేవిధంగా విధానాలను రూపకల్పన చేయటం, ఉపశమన చర్యలను కల్పించటం దేశాధినేతల దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది మరో అంశం. అసలు దేశంలో ఆర్థికవ్యవస్థ పతనోన్ముఖంగా ఉండటానికి కరోనానే కారణమా అన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది. గణాంకాలు పరిశీలిస్తే కరోనా రాకముందే దేశ ఆర్థికవ్యవస్థ దిగజారటం మొదలైందని స్పష్టమవుతున్నది.
2018 జనవరి నుంచే భారత్ వృద్ధి క్రమంగా పడిపోవటం మొదలైంది. ఆర్థికశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఇప్పటికి 16 త్రైమాసికాలుగా ఈ క్షీణత కొనసాగుతున్నది. ఏటా దేశ జీడీపీ వృద్ధి రేటు పడిపోతున్నది. గతేడాదిగా ఉన్న వృద్ధి ఈయేడు లేదు. రెండేండ్ల కింద ఉన్నంత గతేడాది లేదు. ఇది ఏ స్థాయికి పోయిందంటే.. భారతదేశ తలసరి జీడీపీ మన పొరుగున ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్ కన్నా తక్కువ. 2020, 2021లలో భారత్ తలసరి జీడీపీ 1929 డాలర్లు, 2116 డాలర్లు కాగా.. ఈ సంవత్సరాల్లో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1961 డాలర్లు, 2138 డాలర్లు. ఈ అంతరం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుందని ఐఎంఎఫ్ వంటి ఆర్థికసంస్థలు అంచనా వేస్తున్నాయి. మౌలిక వసతులు, మానవ వనరులు సరిగాలేని బంగ్లాదేశ్ ఈ విజయాలను ఎలా సాధించగలుగుతున్నది? నైపుణ్యం లేని మానవ వనరుల్నే పెట్టుబడిగా పెట్టుకొని బంగ్లాదేశ్ ఆర్థికంగా ముందంజ వేస్తున్నది. పెద్ద ఎత్తున కార్మికులు అవసరమయ్యే వస్త్ర ఉత్పత్తిపై దృష్టిపెట్టి ఎగుమతుల్లో దూసుకుపోతున్నది. వస్త్ర పరిశ్రమలోకి మహిళలు భారీ సంఖ్యలో వచ్చేలా ప్రోత్సహించింది. దీంతో ఆ దేశ ఆర్థికరంగం మునుపెన్నడూ చూడనంతటి వేగంతో ముందుకువెళ్తున్నది. కానీ, భారతదేశంలో మహిళలను పారిశ్రామికోత్పత్తి రంగంలోకి తీసుకువచ్చే విషయాన్ని పక్కనపెట్టి.. వాళ్లు ఏ మతం వాళ్లను పెండ్లి చేసుకుంటున్నారు? ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారు? అన్న విషయాలు ప్రధానమైపోయాయి. అంతర్జాతీయంగా పేరున్న థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ 2018లో విడుదల చేసిన ‘worlds most dangerous countries for women’ (ప్రపంచంలో మహిళల భద్రతపరంగా అత్యంత ప్రమాదకర దేశాలు) జాబితాలో భారత్ నెంబర్‌వన్‌గా నిలిచింది. మన తర్వాత రెండో స్థానంలో ఆఫ్గనిస్థాన్, మూడో స్థానంలో సిరియా, నాలుగో స్థానం లో సోమాలియా, ఐదో స్థానంలో సౌదీ అరేబియా నిలిచాయి. ఇక ఆర్థికవ్యవస్థ పతనం కాక.. ముందు కు ఎలా వెళ్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్తల ఆస్తులు ఎంతగా పెరిగాయో తెలుసుకుంటే కళ్లు చెదరక మానవు. 2020లో ముఖేశ్ అంబానీ ఆస్తులు 350 శాతం, గౌతమ్ అదానీ ఆస్తులు ఏకంగా 700 శాతం పెరిగాయి. కరోనా ఏ విధంగానూ వీరి వృద్ధిని అడ్డుకోకపోవటం విచిత్రం.
తెచ్చిన అప్పులనైనా దేశంలో మౌలిక సౌకర్యాలను పెంచటానికో, ఏదైనా భారీ ప్రాజెక్టును ప్రారంభించటానికో ఉపయోగించిందా అంటే అదీ లేదు. ఈ ఎనిమిదేండ్లలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల్లేవు. భారీ పెట్టుబడులు వచ్చిన పరిశ్రమల్లేవు. నిరుద్యోగాన్ని తగ్గించింది లేదు. ప్రజల ఆదాయాన్ని పెంచింది లేదు. దేశాన్ని రుణభారతంగా మార్చింది మోదీ ప్రభుత్వం.
– కె.వి.రవికుమార్
ఉజ్వల తెలంగాణ
ఇదే ఎనిమిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఊహకందనిది. వ్యవసాయం, పరిశ్రమలు, చేతివృత్తులు.. ఏ రంగం తీసుకున్నా ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది రాష్ట్రం. కేంద్రం విధించిన పరిమితుల్లోనే రుణం (జీఎస్డీపీలో 25 శాతం) తీసుకొని వాటితో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. యావత్ తెలంగాణలో నీళ్లు పరవళ్లు తొక్కే పరిస్థితిని తీసుకొచ్చింది. భారీవ్యయానికైనా ఓర్చి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును తీసుకొచ్చింది. దీనివల్ల అటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలు గొప్ప పురోగతి సాధిస్తున్నాయి. అప్పులపరంగా తెలంగాణ దేశంలోని 28 రాష్ర్టాల్లో 25వ స్థానంలో ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు తెలంగాణ కన్నా ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నాయి. కానీ, అభివృద్ధిలో మాత్రం తెలంగాణతో పోటీపడే స్థాయిలో అవి ఉండకపోవటం గమనార్హం. అంటే, తెచ్చిన ప్రతి పైసా సద్వినియోగమవుతున్నది తెలంగాణలోనేనని స్పష్టమవుతున్నది. జీఎస్డీపీ పరంగా ఏటా లక్ష కోట్ల రూపాయల వృద్ధి రాష్ట్రంలో నమోదవుతున్నది.