ఇండియా, దటీజ్ భారత్, ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ – రాష్ర్టాల కూటమే భారతదేశం అని మన రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించింది. భారత్ అంటే రాష్ర్టాలే. సమరీతిలో అన్ని రాష్ర్టాల్లో అభివృద్ధి జరిగేలా చూడటం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న గొప్ప వైవిధ్యాన్ని పదిలపరుస్తూనే, మనమంతా భారతీయులం అనే భావనను పెంపొందించటం ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సమున్నత ఆశయంతో రాజ్యాంగం అందించిన ఈ బాధ్యతను కేంద్రంలోని ఏ సర్కారూ నేటివరకూ చిత్తశుద్ధితో నిర్వర్తించింది లేదు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ రాష్ర్టాల అధికారాలను ఊడబెరుకటమే గాక, రాష్ట్ర ప్రభుత్వాలను గడ్డిపోచల్లాగా రద్దుచేసింది.
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరిస్తూ, ప్రజా తీర్పులను పరిహాసం చేస్తూ.. ‘గొర్రెలు తినెటోడు పోయిండనుకుంటే, బర్రెలు తినెటోడు వచ్చిండు’ అనేట్లుగా వ్యవహరిస్తున్నది. భారతదేశానికి ఆయువుపట్టయిన సమాఖ్య వ్యవస్థనే ధ్వంసం చేసే పెడ పోకడలకు పోతున్నది. ఈ నేపథ్యంలోనే నిరంకుశ కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. అసలు, తెలంగాణ ఉద్యమమే ఆధిపత్య ధోరణిపై తిరుగుబాటు. ఆ ఉద్యమాన్ని ప్రారంభించి, యావత్ దేశమే ఆశ్చర్యపోయే రీతిలో నడిపించి, విజయవంతం చేసిన నాయకుడు కేసీఆర్. ప్రాంతీయ పార్టీల ఐక్యత ప్రాధాన్యాన్ని కేసీఆర్ తొలినుంచీ నొక్కి చెప్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ ఐక్యతను పటిష్ఠపరచటానికి కృషిచేస్తున్నారు. తాజాగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమత కూడా ముందుకొచ్చి.. దేశ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీలు చేతులు కలుపాలని పిలుపునివ్వటం హర్షణీయం.
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈశాన్య రాష్ర్టాల నుంచి దక్షిణాది వరకూ అంతులేని వైవిధ్యం. కట్టుబట్టల్లో, సంస్కృతిలో, భాషల్లో, ఆటపాటల్లో ఎక్కడికక్కడ ప్రత్యేకతలు.. ఈ దేశ ఘనమైన వారసత్వ సంపదగా నిలుస్తాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతి నాగరికత నుంచి, ప్రతి మతం నుంచి భారతదేశం నేర్చుకున్నది. తన అపార జ్ఞానసంపదను మరింత పెంచుకున్నది. ఇంతటి వైవిధ్యపూరిత దేశంలో ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే నాయకుడు వంటి సంకుచిత ధోరణులకు స్థానం లేదు. అందువల్లే, పలు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలే స్థానికప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, వారి నిజమైన ప్రతినిధులుగా కొనసాగుతున్నాయి. రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తికి గ్యారెంటీగా నిలుస్తున్నాయి. మోదీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడిన ఈ ఎనిమిదేండ్లలోనూ.. ఆ బాధ్యతను నిర్వర్తించింది ప్రాంతీయపార్టీలే. కాబట్టి, దేశంలో ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వం సజీవంగా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల బలోపేతమే తక్షణ కర్తవ్యం.