చరిత్ర చదువుతున్నప్పుడు దాన ధర్మాలు చేసిన రాజులను కీర్తిస్తూ రాసిన సాహిత్యం, ఇచ్చిన బిరుదులను చూస్తాం. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యాలు చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఓ స్థాయికి ఎదిగి ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత మూలాలను మర్చిపోతున్న దుస్థితి. తన, మన అనే మమకారాలు మాయమవుతున్నపరిస్థితులు చూస్తున్న ప్రస్తుత సందర్భంలో ప్రజల ఉపయోగం కోసం సొంత డబ్బును వెచ్చించటం గొప్ప విషయం.కోట్ల రూపాయలను లెక్క చేయకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు బీద బిక్కి జనాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన సంపాదనను ఉమ్మడి ఆస్తిగా ప్రకటించి అందుకు నడుం కట్టడం కొనియాడదగింది. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, పారిశుధ్యం, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ముందుకురావటం ఆహ్వానించదగినది. ఆదర్శనీయం, అనుసరణీయం.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి దంపతుల కుమారుడు సుభాష్ రెడ్డి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పాఠశాల విద్యను మండల కేంద్రంలోని బీబీపేట ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. జీవనోపాధికోసం అందరిలాగే హైదరాబాద్ వచ్చి, వ్యాపా రంలో స్థిరపడ్డారు. తన సంపాదనలో కొంత ప్రజల కోసం ఖర్చు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సేవాగుణానికి కొత్త భాష్యం చెప్పడమే కాదు, తానే నిర్వచనంగా నిలిచాడు.
ఈ క్రమంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల జీర్ణావస్థకు చేరి కూలిపోయే దశలో కనీ స వసతుల లేమితో ఉండటం చూశారు. దీంతో విద్యార్థులకు సకల సౌకర్యాలతో నూతన పాఠశాల ను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆరు కోట్ల పైచిలుకు వ్యయంతో పాఠశాల నూతన భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగిపోకుండా, స్కూల్ నిర్వహణ కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే దూరదృష్టితో మిత్రుల సహకారంతో రెండు కోట్ల కార్పస్ ఫండ్‌ను స్కూల్ అకౌంట్లో జమ చేసి, వచ్చే వడ్డీతోనే స్కూల్ నడిచేవిధంగా చేసి తనదైన బాధ్యత నిర్వర్తించారు. యావత్ తెలుగు రాష్ర్టాలే కాదు, ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా లైబ్రరీ, ప్రయోగశాలలు, టీచర్లకు విశ్రాంతి గదులు, అత్యాధునిక ప్రొజెక్టర్లతో డిజిటల్ తరగతి గదులు కట్టించారు. విశాల మైదానంతో పురాతన చారిత్రక తక్షశిల లాంటి పాఠశాలను నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
స్వగ్రామమైన జనగామలో పంచాయతీ భవ నం శిథిలావస్థకు చేరితే ప్రభుత్వం ఇచ్చే నిధులకు, తాను అదనంగా ఇరువై లక్షల పైచిలుకు కలిపి రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. అంతేకాకుండా మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైతే ప్రభుత్వ నిధులకు అదనంగా రెండు కోట్లకుపైగా వెచ్చించి అత్యద్భుతంగా పేదలకు ఇండ్లు కట్టించి తెలంగాణకే రోల్ మోడల్‌గా నిలిచారు. ఇవేకాకుండా మండల పరిధిలోని యాడవరం, మందాపూర్, ఈసనగర్ వంటి గ్రామాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రోడ్లు, దేవాలయాలు అడిగినదే తరువాయి అన్నీ తానై నిర్మించారు. పై చదువులు చదువాలనే ఆశయం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఉన్నవారిని ఆదుకుంటూ విద్యాదానం చేస్తున్నవారు అభినవ పూలే సుభాష్‌రెడ్డి. ఎవరికైనా ఆరోగ్యం బాగలేక వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోతే.. కార్పొరేట్ వైద్యం అందిస్తు న్న ప్రాణదాత సుభాష్‌రెడ్డి. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభానికి హాజరైన మంత్రి కేటీఆర్ పాఠశాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘శ్రీమంతుడు’ సినిమాను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అదే వేదికపైన జూనియర్ కళాశాలకు అనుమతులు ఇప్పించి సినిమా నటుడు మహేష్‌బాబును తీసుకొస్తానని మాటిచ్చారు. అది విన్న మహేష్‌బాబు సినిమా యూనిట్ మొత్తం గ్రామాన్ని పర్యటిస్తామని సామాజిక మాధ్యమంలో వెల్లడించటం అభినందనీయం, హర్షణీయం.
ప్రజల కోసం ఇంత చేస్తున్నా..రాజకీయాలకు, పొగడ్తలకు, ప్రచార ఆర్భాటాలకు అల్లంత దూరంలో ఉంటారు సుభాష్‌రెడ్డి. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని పంచాయతీ సభ్యులు, యువకులు, పెద్దలు బీబీపేట ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి.
‘నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అన్న అంబేద్కర్ స్ఫూర్తితో పేద ప్రజలకు సేవలందిస్తున్న తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి రాష్ట్రంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. తమకున్న సంపదలో కొం తైనా ప్రజల కోసం వెచ్చించాలన్న సుభాష్‌రెడ్డి బాటలో సమాజం నడువాలని, నడుస్తుందని ఆశిద్దాం.
ముఖేష్ సామల
97039 73946