హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు ఎడ్‌సెట్-2026ను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగనున్నాయి.
పరీక్షల నిర్వహణ కోసం 59 సెంటర్లు ఏర్పాటుచేసినట్టు, నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలకు అనుమతించబోమని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు అత్యధికంగా మహిళలే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఏకంగా 82శాతం మహిళలు ఎడ్‌సెట్‌కు పోటీపడుతున్నారు. మొత్తం 35,600 మంది దరఖాస్తు చేయగా, ఇందులో 29,441 మంది మహిళలే ఉన్నారు. ఇక పురుషులు 6,155 మంది, ట్రాన్స్జెండర్లు నలుగురు ఎడ్‌సెట్ రాయనున్నారు.