మర్రిగూడ,మే 10 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని ఖుదాభక్షిపల్లి, శివన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలను చూస్తే కన్నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులను ఇంతలా క్షోభపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు.
లారీలు రాకపోవడంతో రోజులతరబడి కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాల ప్రమాదం పొంచి ఉన్నదని, వానలు పడి ధాన్యం తడిస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కై తరుగు, తాలు పేరుతో రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు కంటినిండా నిద్రపోయారని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, ఇదే మాదిరిగా వ్యవహరించి, రైతులను ఇబ్బందులు పెడితే నియోజకవర్గ స్థాయిలో రైతులను కూడగట్టి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.
రాజగోపాల్ రెడ్డి కల్లాల వెంట తిరగాలి..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్లాల వెంట తిరిగి రైతుల బాధలను తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల సూచించారు. రైతులకు మంచి చేస్తే మంత్రి పదవి అదే వస్తుందని, ముందుగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్లు అయిలి లక్ష్మీనర్సింహ,దేశిడి సురేందర్ రెడ్డి, ఎడ్ల శ్రీరాములు, మాజీ ఎంపీటీసీలు ఊరిపక్క సరితా నగేష్, మారగోని వెంకటయ్య యాదవ్, ఉప సర్పంచ్ జంగిలి శాంతమ్మ మల్లయ్య, నాయకులు చెరుకు శ్రీరామ్ గౌడ్, రంగినేని యాదగిరి రావు,ఆకారపు శ్రీను, సంకబుడ్డి నర్సింహ,మాదగోని రాజు, శిశుపాల్ రెడ్డి, లోడె యాదయ్య, దేప శ్రీనివాస్ రెడ్డి, బండి యాదయ్య, వనమాల మహేష్, లఫంగి భిక్షం,ఆంగోతు హరిప్రసాద్ నాయక్, నున్నగోపుల గిరి, లెంకలపల్లి పాపాచారి, మాదగోని హరికృష్ణ,నల్ల శేఖర్, కొండాపురం నరేష్, మల్లం అంజయ్య, బోయపల్లి శ్రీకాంత్, మాద సత్తయ్య, శిలువేరు చినరాములు పాల్గొన్నారు.