భైంసా, మే 10 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకొనేందుకు నిర్మల్ జిల్లా భైంసాలోని సబ్ సెంటర్, మాటేగాం సెంటర్కు తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైంసా పట్టణంలోని మినీ స్టేడియం వద్ద మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. పంటను తీసుకొచ్చి పక్షం రోజులైనా కొనుగోళ్లు లేక మండుటెండలో కుప్పల వద్దే కాపాలా ఉంటున్నారు. సెంటర్లలో గన్నీ సంచులు ఇవ్వక మక్కలను తరలించేందుకు లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక లబోదిబో మంటున్నారు. అధికారులు లారీలు రావడం లేదంటూ కాంటాలు నిలిపివేశారు. రైతులే గన్నీ సంచులు కొనుగోలు చేసి వాహనాలు సమకూర్చుకొని సమీపంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని అంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షం కురిసి పంట నీళ్లపాలవుతుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. గన్నీ సంచులు అందించి మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
పక్షం రోజులు అవుతున్నది
కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసు కొచ్చి పక్షం రోజులు గడిచింది. వర్షం పడుతోందని, టార్ఫాలిన్ లు కప్పి ఉంచుతున్నామని, వర్షం పడితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంతేగాకుండా రైతులే గన్నీ సంచులు, టార్ఫాలిన్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాకుండా మక్కలు కొనడానికి ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.
– సందీప్, రైతు, భైంసా