Telangana Economy | కేసీఆర్ పాలనలో దేశంలో శిఖరాగ్రానికి చేరిన తెలంగాణ ప్రగతి ఖ్యాతి.. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో పాతాళానికి పడిపోయింది. బీఆర్ఎస్ ఏలుబడిలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్ర ఆర్థికం.. కాంగ్రెస్ పాలనలో చీకట్లలో మునిగిపోయింది. కేసీఆర్ దిశానిర్దేశంలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు దిక్కుతోచని స్థితికి చేరింది. బీఆర్ఎస్ హయాంలో రెండంకెల వృద్ధిరేటును నమోదు చేసిన రాష్ట్ర రెవెన్యూ రాబడులు.. ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. రేవంత్ పాలనలో అంచనాలకు మించిన అప్పులు కొత్త తిప్పలు తెస్తున్నాయి. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నదా? తెలంగాణ రాష్ట్ర ఖజానా మరింతగా కుదేలైందా? కేసీఆర్ హయాంలో వేగంగా ఎగబాకిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, రేవంత్ పాలనలో మందగమనంలోకి పడిపోయిందా? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందా?రాష్ట్ర రెవెన్యూ రాబడులు, అప్పులకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలను విశ్లేషిస్తే.. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటులో భారీ క్షీణత నమోదైనట్టు అర్థమవుతున్నది.
కేసీఆర్ పాలన ప్రారంభమైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.49,779 కోట్లుగా ఉండగా, బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి 2023-24 నాటికి రూ.1,69,089 కోట్లకు చేరుకున్నాయి. అంటే పదేండ్ల వ్యవధిలో రెవెన్యూ రాబడుల్లో వృద్ధిరేటు ఏకంగా 239.67 శాతంగా నమోదైంది. ఈలెక్కన సగటున ఏడాదికి 23.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు చెప్పవచ్చు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గణాంకాలను గమనిస్తే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నాటి అంచనాల ప్రకారం రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1,81,810 కోట్లుగా ఉన్నాయి. దీని ప్రకారం వార్షిక వృద్ధి రేటు 3.69 శాతానికి పడిపోయినట్టు అర్థమవుతున్నది. గతంతో పోల్చితే ప్రస్తుత రెవెన్యూ వృద్ధి రేటు మునుపటి వేగంలో 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ప్రధాన రాబడి వనరులైన పన్ను ఆదాయంలో కూడా లక్ష్యానికి మించి సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ రెవెన్యూ రాబడులు.. ఇప్పుడు కనిష్ఠ స్థాయికి పతనమవడం ఆర్థిక రంగంలో కలకలం సృష్టిస్తున్నది.
2025-26 బడ్జెట్ గణాంకాల ప్రకారం మొన్నటి ఆర్థిక సంవత్సరంలో రూ. 2.29 లక్షల కోట్ల మేర రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, కాగ్ లెక్కల ప్రకారం.. మార్చి నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1,81,810 కోట్లుగా మాత్రమే నమోదయ్యాయి. అంటే, ఇది అంచనాలో 79 శాతమే. ఇక, బడ్జెట్లో రూ. 2,738 కోట్ల మేర రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేయగా.. మిగులు ఏమో గానీ, రెవెన్యూ లోటు రూ. 9,235 కోట్లుగా (-337.25 శాతం) నమోదైంది. మొత్తంగా కేసీఆర్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఆదాయ వనరుల పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారిందని, కాగ్ తాజా గణాంకాలే ఇందుకు రుజువుగా నిలిచాయని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణలో, రెండున్నరేండ్ల కాలంలోనే వృద్ధి రేటు ఇంతలా పడిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రెవెన్యూ రాబడులు అంతకంతకూ పడిపోతుండగా.. ఎడాపెడా చేస్తున్న అప్పులు కొత్త తిప్పలు తెస్తున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాపడుతున్నారు. గత ఏడాది రూ. 54,009.74 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఆ పరిమితిని దాటి ఏకంగా రూ. 77,762.35 కోట్ల అప్పులను ప్రభుత్వం చేసినట్టు కాగ్ తాజా గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. అంటే అంచనా కంటే 43.98 శాతం అదనంగా అప్పులు చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడులు పడిపోవడం, మరోవైపు అప్పులు పెరిగిపోవడాన్ని విశ్లేషిస్తే.. ఆదాయ మార్గాలను పెంచడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారన్న విషయం తేటతెల్లమౌతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక నిర్వహణలో పాలకులకు పరిపక్వత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయపడుతున్నారు. ఇదే ధోరణి భవిష్యత్తులోనూ కొనసాగితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావంపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
