హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : 2022-23 ఎంబీబీఎస్ బ్యాచ్ ఫైనలియర్ పార్ట్-2 పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించాలని టీ-జూడా డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కాళోజీ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కు టీ-జూడా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీ-జూడా అధ్యక్ష, కార్యదర్శులు గంగనోళ్ల విక్రమ్, నరహరి చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఫైనలియర్ ఎంబీబీఎస్ పార్ట్-2లో మొత్తం 9 క్లినికల్ సబ్జెక్టుల పరీక్షలను ఒకే సారి నిర్వహించడంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, అకడమిక్ భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్లను ఈనెల 18న విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది. 18న సాయంత్రం 5గంటల నుంచి ఈ హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరుస్తామని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలను 23 నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్నిరకాల స్కూళ్లు ‘డ్రగ్ ప్రీ డిక్లరేషన్’ సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అన్నిరకాల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసి ఐఎస్ఎంఎస్ పోర్టళ్లలో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి అని, డీఈవోలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.