హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): అబద్ధాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించలేమని, నిజాలను నికార్సుగా ప్రజల ముందు పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి, కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిసమ్ల బాకీలు.. ఇలా అన్నిరకాలు కలిపి రూ.8,21,651 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేండ్ల తమ పాలనలో కేవలం రూ.1.77 కోట్ల అప్పులే చేశామని, కేసీఆర్ చేసిన అప్పులకు రూ.2,08,681 కోట్లను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు చెల్లించామని తెలిపారు.
ఒకవైపు నెలనెలా ఉద్యోగులకు జీతా లు చెల్లిస్తూనే రైతు భరోసాతోపాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. సింగరేణి కాలరీస్‌లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించానని, వారు సమగ్ర విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. వ్యక్తుల స్థాయిని వారి పుట్టుకతో కాదు, వారు పోషించే పాత్ర, వారు చేసే పనితోనే నిర్ణయిస్తారని చెప్పారు. సమావేశం లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు సమయపాలన కంటే ఆలస్యమే ఎకువగా అలవాటు అయినట్టున్నది. ఒకరోజు ముందుగానే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని జీ 29 హాల్లో ప్రెస్‌మీట్ ఉంటుందని భట్టి మీడియా గ్రూప్‌లో అధికారికంగా సమాచారం ఇచ్చారు. అప్పులు, సింగరేణిలో బొగ్గు లాట్లు కనిపించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ అనగానే జర్నలిస్టులు అందరూ 12 గంటల్లోపే సమావేశ హాల్‌కు చేరుకున్నారు. అయితే, ఒంటి గంట దాటినా మీడియా సమావేశ హాల్‌కు భట్టి రాకపోవడంతో విసిగిపోయిన జర్నలిస్టులంతా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత తీరిగ్గా వచ్చిన భట్టి, సమావేశ హాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
జర్నలిస్టుల ఆగ్రహాన్ని గ్రహించి ఎట్టకేలకు స్పందించిన భట్టి విక్రమార.. ‘ఆలస్యానికి చింతిస్తున్నాను’ అంటూ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పి పరిస్థితిని చకదిద్దే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావడంతో మీడియా ప్రతినిధులు కాస్త అసంతృప్తిగానే ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. మధ్యా హ్నం 1.15 గంటలకు ప్రెస్‌మీట్ ప్రారంభించి 2.15 గంటలకు ముగించారు. ‘భట్టి విక్రమార నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాలకు ‘అర్ధగంట ఆలస్యం’ అనేది సాధారణమైన విషయం. కానీ, ఈ సారి మాత్రం తన రికార్డును తానే తిరగరాస్తూ ఏకంగా గంటకు పైగా లేటుగా వచ్చారు’ అని జర్నలిస్టులు చర్చించుకున్నారు.