సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : ప్లాట్ల ఈ వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా తురయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇందులో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉంటాయి. ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను మాత్రమే అభివృద్ధి చేసి, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఈ- యాక్షన్ పద్ధతిలో విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు శుక్రవారం ప్రీ బిడ్ మీటింగ్‌ను తొర్రూర్ సైట్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేందుకు 300 నుంచి 600 చదరపు గజాల్లో హెచ్ఎండీఏ లే అవుట్‌ను రూపొందించింది. లే అవుట్‌కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి (మాస్టర్ ప్లాన్ రోడ్), లే అవుట్ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడల్పుతో రహదారులను ఏర్పాటు చేస్తున్నది. గజానికి కనీస (బేసిక్ రేటు) ధర రూ.20,000గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేవారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,180లు చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ- యాక్షన్‌లో పాల్గొనేందుకు ప్రతి ప్లాట్‌కు రూ. లక్ష చొప్పున ఎర్లీమనీ డిపాజిట్(ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. వచ్చేనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి ఒక దఫా, మధ్యాహ్నం రెండు నుంచి మరొక దఫా.. నాలుగు రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో ఎంఎస్టీసీ ద్వారా ప్లాట్ల ఈ- వేలం ఉంటుంది. ప్లాట్ల విక్రయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీ వైబ్సైట్లలోఅందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.