హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): దసరా పండుగనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసినవి మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు నెలకొల్పాయి. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో రాష్ట్రం ప్రభుత్వం మద్యంపై ఒక్కరోజు నిషేధం అమలు చేసింది. అయినా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో దసరా పండుగ ధూంధాంగా జరిగింది. ఆశావహులు డబ్బులు బయటికి తీసి, జోర్దార్గా మద్యం దావత్‌లు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు అందిన ఎక్సైజ్ నివేదికల ప్రకారం సద్దుల బతుకమ్మ, దసరా ముందు రోజు, దసరాకు కలిపి రూ.697 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు, 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇవి అధికారిక లెక్కలు కాగా.. పాత స్టాక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.730 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా మొత్తం 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్‌శాఖ అప్పట్లో వెల్లడించింది. అంటే రోజుకు సగటున రూ.110 కోట్ల చొప్పున మద్యం తాగేశారు. ఈ దసరాకు రోజుకు రూ.243 కోట్ల చొప్పున లిక్కర్ విక్రయాలు జరిగినట్టు రికార్డులు చెప్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ దసరా ముందు రెండు రోజులు మద్యం విక్రయాలు 60 శాతం పెరిగినట్టు, ఎక్సైజ్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు అని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దుకాణాల సామర్థ్యానికి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు రోజూ 12 గంటలు తెరిచి ఉంటాయి. రిటైర్డ్ ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణదారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మద్యం దుకాణం క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా మద్యం సీసాలు అమ్మితే.. సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక హాఫ్ బాటిల్ చొప్పున రోజుకు 30 పెట్టెల (ఒక పెట్టె =12 ఫుల్ బాటిల్స్, లేదా 48 క్వార్టర్లు, 24 ఆఫ్ బాటిల్స్) మద్యం అమ్మగలరు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల ద్వారా రోజుకు 33,900 పెట్టెలు అమ్ముతారు. ఈ విక్రయాలలో 45 శాతం బీరు, 55 శాతం లిక్కర్ పెట్టెలు ఉంటాయని అంచనా.
రెస్టారెంట్లలో సగటున ప్రతి 10 నిమిషాలకు ఒక ఫుల్ బాటిల్, లేదా ఒక బీర్ బాటిల్ చొప్పున అమ్ముడుపోతుందని అంచనా. ఈ లెక్కన రోజుకు 7026 పెట్టెల మద్యం విక్రయం జరుగుతుందని అంచనా. ఏ4 దుకాణాలు, బార్ల విక్రయాలు మొత్తం కలిపినా.. రోజుకు 50 వేల పెట్టెలకు లోపే మద్యం విక్రయాలు జరుగాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు సగటున లక్ష పెట్టెల బీరు, 1.10 లక్షల పెట్టెల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదెలా సాధ్యం అంటే.. రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా సాగుతున్న 1.25 లక్షల బెల్టు దుకాణాల ద్వారానే 70 శాతం మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
మద్యం విక్రయాలను పెంచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పండుగకు ఐదు రోజుల ముందు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని ప్రచారం జరుగుతున్నది. ఈ సారి అక్టోబర్ 2న దసరాతోపాటు గాంధీ జయంతి కూడా ఉండటంతో మద్య నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దీంతో అటు మందుబాబులు, ఇటు మద్యం వ్యాపారులు జాగ్రత్తపడ్డారు. వీరికి తోడు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ మద్దతుదారులకు, పార్టీ శ్రేణులకు తప్పనిసరిగా దసరా పండుగ దావత్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ముందుగానే అంచనా వేసిన ఎక్సైజ్‌శాఖ భారీ గా మద్యం నిల్వలను సిద్ధం చేసింది. ఆర్డర్లు కూడా ఊహించిన దాని కన్నా ఎక్కువగానే వచ్చాయి. యువత ప్రత్యేక బ్యాచ్‌గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహిక అభ్యర్థుల మీద మందుకోసం ఒత్తిడి తె చ్చినట్టు సమాచారం. మరోవైపు ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటికో క్వార్టర్ చొప్పున పంపిణీ చేసినట్టు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మద్యం టెండర్లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడాన్ని సులభతరం చేసినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరి హరికిరణ్ శుక్రవారం తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ మద్యం షాపుల కోసం ఆహ్వానించిన దరఖాస్తు ఫారాలతోపాటు రిజర్వేషన్లు, గైడ్‌లైన్స్ వివరాలను tgbcl.telangana.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. మద్యం షాపుల రిజర్వేషన్లు, దరఖాస్తు ఫారం, దరఖాస్తు అందజేసినట్టు రశీదు, డ్రాలో పాల్గొనడానికి ఎంట్రీ ఫారం కూడా ఆన్లైన్లోనే పొందుపరిచినట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని 34 జిల్లాలకు సంబంధించిన ఎక్సైజ్ గెజిట్‌ను విడుదల చేశామని అన్నారు.