న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఇకపై బహుశా బంగారం ధరల్ని చూస్తే అర్థం కావచ్చని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న మల్హోత్రా మాట్లాడుతూ.. ఇంతకుముందు ముడి చమురు ధరలు ప్రపంచ అనిశ్చితికి సంకేతాలుగా ఉండేవని, ఇప్పుడు కొత్త ప్రామాణికంగా గోల్డ్ రేట్లు వచ్చాయన్నారు. కాగా, ప్రస్తుతం పసిడి ధరలు ఆల్టైమ్ హై స్థాయిలో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో పుత్తడి విలువ క్రమేణా పెరుగుతూపోతున్నది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) తులం ఏకంగా రూ.1.20 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నిజానికి నేడు దాదాపు ప్రతీ దేశం ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఒకింత ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రస్తుత వాణిజ్య విధానాలు.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి అవకాశాలను దెబ్బతీసేలా ఉంటున్నాయని మల్హోత్రా అన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ఇవి ఇబ్బందికరమేనని హెచ్చరించారు. ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నది గుర్తుచేశారు. బుధవారం ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో వరుసగా రెండోసారీ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన సంగతి విదితమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ఆ దేశంతో భారత వాణిజ్య ఒప్పందం అంశాలు వాటి ప్రభావం ఆధారంగా రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధానం ఉంటుందని మల్హోత్రా నాడు విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీరేట్ల కోతలకు వీలుంటుందనీ స్పష్టం చేశారు.
భారత స్థూల ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకుల్లో ఉన్నా.. భారత్ స్థిరంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు. తక్కువ ద్రవ్యోల్బణం, సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు, పరిమిత కరెంట్ ఖాతా లోటు, బ్యాంకుల్లో బలమైన బ్యాలెన్స్ షీట్లు, లాభదాయక కార్పొరేట్ వ్యవస్థ వంటివి భారత్కు కలిసొస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధానాలు, పటిష్ఠమైన రెగ్యులేటరీ వ్యవస్థలూ ఇందుకు దోహదం చేస్తున్నట్టు వివరించారు.
బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది. ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.500 దిగి రూ.1,20,600గా నమోదైంది. బుధవారం రూ.1,21,100తో ఆల్టైమ్ హైలో నిలిచినది తెలిసిందే. ఇక వెండి కిలో ధర కూడా రూ.500 పడిపోయి రూ.1,50,000గా ఉన్నది. మంగళవారం తొలిసారి రూ.1,50,500 మార్కును తాకినది విదితమే. గురువారం గాంధీ జయంతి, దసరా సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్లో రేట్లు దిగిరాగా, అంతకుముందు 5 రోజులపాటు పసిడి విలువ పెరుగుతూపోవడం గమనార్హం. కాగా, హైదరాబాద్ విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం రూ.650 తగ్గి రూ.1,18,040గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.600 దిగి రూ.1,08,200 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ తగ్గింది. ఔన్స్ 3,863.51 డాలర్లకు దిగొచ్చింది. మునుపు ఇది రికార్డు స్థాయిలో 3,897.20 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ కూడా ఔన్స్ 47.34 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. ఇంతకుముందు 48.10 డాలర్లుగా ఉన్నది.