జూబ్లీహిల్స్, అక్టోబర్3: జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది. తర్వరలో ఇక్కడ బై ఎలక్షన్‌కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేతలు రచ్చకెక్కుతున్నారు. టికెట్ ఆశించినవారిలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అజరుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి పోటీనుంచి తప్పించినప్పటికీ.. టికెట్ రేసులో అజరుద్దీన్ తర్వాత బలమైన అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్‌కు టికెట్ రాకుండా అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వేసిన అభివృద్ధి పాచిక బలంగా పారింది.
దీంతో టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని ప్రకటించి.. అప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ముగ్గురు పేర్లు ఇవ్వాలని తాజాగా ఆదేశాలివ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే టికెట్ రేసులో ఉన్న ఈ నేతలు.. నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని చాటుకుంటున్న విషయం తెలిసిందే.
రహ్మత్‌నగర్ కార్మికనగర్ కూడలిలో దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. స్థ్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఫొటో లేదన్న అక్కసుతో కార్పొరేటర్ వర్గీయులే దాన్ని చించివేశారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ ఎంపీ అనుచరులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. అయితే ఫ్లెక్సీ వివాదంపై స్థానిక మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.
జూబ్లీహిల్స్‌లో ఎన్నికలకు ముందే టికెట్ ఫైట్ వేడిపుట్టిస్తోంది. ఒరిజనల్ కాంగ్రెస్ వర్సెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ సామాజిక మాధ్యమాలలో కొత్త వార్ మొదలైంది. నిజానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్ మార్క్ గ్రూపు తగాదాలు.. ఆధిపత్య పోరే ఎక్కువగా నడుస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలంటూ బయటకు ఆర్భాటం చేస్తున్న ముగ్గురు మంత్రులు.. మూడు నెలలుగా ముగ్గురు నేతలను బుజ్జగించే పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే సయోధ్య ఎంతకీ సాధ్యపడకపోవడంతో వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.
దీంతో ప్రజల్లో కూడా అసలు కాంగ్రెస్ నేతలు ఎవరు.. డూప్లికేట్ కాంగ్రెస్ నేతలు ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమనేత ఫ్లెక్సీని చించివేసిన కార్పొరేటర్ వర్గీయులు డూప్లికేట్ అని.. వారు భూ కబ్జాలు, ఇళ్లు కడితే వసూళ్లు, బెదిరింపులు చేస్తూ ఒరిజనల్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. మితిమీరిపోతున్న వీరి ఆగడాలతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని.. వేరే పార్టీ నుంచి వచ్చిన ఈ కార్పొరేటర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సొంతపార్టీ నేతలే సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తుండటం విశేషం.