శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉత్సవాలు ఆలయానికి పరిమితం కానున్నాయి. గురువారం ఉదయం ఆలయ ఈవో లవన్న అర్చక పండితులతో కలిసి ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుంచి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్వికగ్వరణం, యాగశాల ప్రవేశం, గణపతిపూజ అఖండదీపస్థాపన మండపారాధన, తదితర పూజాకార్యక్రమాలు జరుగనున్నాయి.
అలాగే స్వామి ఆలయ యాగశాలా ప్రవేశం, శివసంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ, వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకం జరగనున్నాయి. మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద తెలిపారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపించి ప్రాకారోత్సవనంతరం రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం జరుగుతుందని ఈవో లవన్న వివరించారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయ ప్రకారంలో జరిగే ఉత్సవంలో శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారు శైలపుత్రిగా భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి మల్లికార్జునుడితో కలిసి అమ్మవారు భృంగివాహనంపై విహరించనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నవరాత్రుల పాటు దక్షిణ మాడవీధి, హరిహరాయ గోపురం, భ్రామరి కళావేదిక వద్ద ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. క్షేత్రానికి వచ్చే మల్లన్న భక్తులకు నేటి నుంచే స్పర్శ దర్శనం కల్పించనున్నారు. ప్రస్తుతం భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్ల రూపంలో ఇస్తుండగా.. గురువారం నుంచి అన్నదాన భవనంలో యాత్రికుల విడుతల వారీగా అన్నప్రసాదం అందజేయనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించాల్సిన దసరా మహోత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. స్వామిఅమ్మవార్లకు జరిగే నిత్యకైంకర్యాలు కేవలం ఆలయ ప్రాకారంలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.