సహజంగా కమాండ్ ఏరియాలో జూన్ తొలివారంలోనే నార్లు పోసి, చివరి వారం నుంచి నాట్లు వేస్తారు. ఒకవేళ కాలం కొంత ఆలస్యమైతే, జూలై మొదటి వారం వరకు నార్లు పోసి, నాట్లు పూర్తి చేస్తారు. అయితే ఈ సారి కరువు మేఘాలు కమ్ముకోవడంతో పరిస్థితి మారిపోయింది. వ్యవసాయ జిల్లాగా పేరుగాంచిన జగిత్యాలలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్నా.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఎస్సారెస్పీలో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరడం, కాకతీయ కాలువకు నీళ్లిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన కనిపిస్తున్నది. ఇప్పటి వరకు మెజార్టీ రైతులు అసలు నార్లే పోయకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
జగిత్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జగిత్యాల వ్యవసాయ జిల్లాగా పేరొందింది. మూడు దశాబ్దాలుగా వరి సాగు, దిగుబడిలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచింది. వరి పంటకు మారుపేరుగా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాలను సైతం ఎప్పుడో అధిగమించింది. ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా కంటే చేరువగా జగిత్యాల జిల్లానే ఉండడం, కాకతీయ కాలువ 30 కిలోమీటర్ కంటే ముందే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు ఉండడంతో అవి పూర్తిగా ఆయకట్టు మండలాలుగా మారిపోయాయి. మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాలు కాకతీయ కాలువ కమాండ్ ఏరియా పరిధిలోకి చేరిపోయాయి. అయితే ఆ ఐదు మండలాలు మాత్రం బావులపై ఆధారపడాల్సి వచ్చింది. కాగా, దాదాపు రెండు దశబ్దాల క్రితం ఎస్సారెస్పీ నుంచి 122 కిలోమీటర్ల పొడవున వరద కాలువ నిర్మాణం అయింది.
నాన్ కమాండ్ ఏరియాలోని ఐదు మండలాలకు నాలుగు మండలాల మీదుగా వరద కాలువ పోతుండడంతో ఆయా మండలాల రైతులకు కొంత ప్రయోజనం చేకూరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించడానికి ఏర్పాట్లు చేయడం, అలాగే వరద కాలువకు తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుకొనే అవకాశం కల్పించడంతో నాన్ కమాండ్ ఏరియా పరిధిలో ఉన్న ఐదు మండలాల రైతులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. 2018 నుంచి 2023 మధ్య ఎస్సారెస్పీలో నీటికి ఇబ్బంది వచ్చినప్పటికీ.. పంటలకు, ముఖ్యంగా నార్లు పోసుకొని నాట్లు వేసుకొనే సమయానికి నీటి కొరత లేకుండా చూడడంలో విజయవంతమైనా.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. జూలై మూడో వారం వచ్చినా ఇంత వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి వరద జాడ కరువైంది. కేవలం 15 టీఎంసీల నీరే ఉండడంతో నారుకు, నాట్లకు సైతం నీరు ఇవ్వలేని ధైన్య పరిస్థితి ఉన్నది.
కాకతీయ కాలువ ఆయకట్టు పరిధిలో ఎస్సారెస్పీ తొలి దిగువ భాగంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండల పరిధిలో యాభై శాతం నార్లు పోయలేదు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతోపాటు వర్షకొండ, డబ్బ, గోదూరు, కేశవపూర్, కోజన్ కొత్తూరు, కొమటి కొండాపూర్ గ్రామాల్లోనూ యాభై శాతం మంది రైతులు ఇప్పటి వరకు నార్లు పోయలేదు. మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, జగిత్యాల, ధర్మపురి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. సహజంగా జూన్ మొదటి వారంలో నార్లు పోసి, ఇరవై, ఇరవై ఐదు రోజుల తర్వాత నాట్లు వేస్తారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటే జూలై మొదటి వారం నుంచి 15 వరకు నారు పోస్తుంటారు. ఇరవై రోజుల తర్వాత నాటేస్తారు. కానీ, కాకతీయ కాలువకు నీళ్లు రాకపోవడంతో నారు పోసేందుకు.. పోసిన చోట నాట్లు వేసేందుకు రైతులు భయపడుతున్నారు. కొందరు రైతులు కాలంపై ఆశతో బోరుబావులు ఉన్న చోట నార్లు పోసి ఎదురు చూస్తున్నారు.

జూలై 15 తర్వాత నార్లు పోసినా పంట దిగుబడి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని రైతులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు రెండో వారం వరకు నాట్లు వేస్తేనే రైతులకు పంట చేతికి వస్తుందని, లేకుంటే నిండా మునుగుడేనని వాపోతున్నారు. కాకతీయ కాలువ పరిధిలోనే కాకుండా, వరద కాలువ పరీవాహకంలో ఉన్న ఐదు నాన్‌కమాండ్ మండలాల్లో రైతులు సైతం ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నార్లు పోయకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వరద కాలువ పరీవాహకంలో ఉన్న మల్యాల మండలంలో వానకాలంలో సగటున 14వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ వస్తున్నా.. ఈ సారి నీటి ప్రవాహం లేకపోవడం, భూగర్భజలాలు సైతం అడుగంటిపోవడంతో నార్లు పోయకుండా తాత్సారం చేయడం కనిపిస్తున్నది. అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1500 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసినట్టు తెలుస్తున్నది. సగటున సాగు చేసే విస్తీర్ణంలో కేవలం 10 శాతంలో మాత్రమే నాట్లు వేశారంటే రైతుల ధైన్యస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఎస్సారెస్పీలోకి నీరు చేరకపోవడం, పంటకాలం అదును దాటి పోతుండడంతో రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందన్న నమ్మకం కనిపించడం లేదని, వర్షాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే కాలం గడిచిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నార్లు పోసి, నాట్లు వేసేందుకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణహిత నీటిని కన్నెపెల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి నీటిని వరద కాలువకు తరలించాలని, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ను నింపాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వరద కాలువ నుంచి కాకతీయ కాలువలోకి నీటిని మళ్లించి, డీ80 కాలువ పరిధిలో ఉన్న భూములకు నీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ ప్రక్రియను చేపట్టి, వరద కాలువలోకి నీళ్లు తీసుకువస్తే నార్లతోపాటు నాట్లు పూర్తి అయ్యే వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. మరో నెల వరకు వచ్చే నీరు ఆదుకుంటుందని, ఆపైన వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే నార్లు పోసుడు, నాట్లు వేయడం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు తీగల రవీందర్ రెడ్డికి ఆరెకరాల భూమి ఉన్నది. ఎస్సారెస్పీకి దిగువన తొలి భాగంలోనే ఆ మండలం ఉండడం, దీని మీదుగానే కాకతీయ ప్రధాన కాలువ వెళ్తుండడంతో ఇన్నాళ్లూ నిరందీగా వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు. కాకతీయ కాలువ నుంచి క్రమం తప్పకుండా నీరు రావడంతో ఏటా రెండు పంటలు పండించాడు. అయితే ఈ సారి జూలై రెండో వారం దాటుతున్నా వర్షాలు లేకపోవడం, కాకతీయ కాలువకు నీళ్లివ్వకపోవడంతో అసలు నారు పోసేందుకు భయపడుతున్నాడు. అదును దాటి పోతుండడంతో సాగు చేయాలా.. వద్దా..? అనే సందిగ్ధంలో పడిపోయాడు. ఒక్క రవీందర్రెడ్డే కాదు, వందలాది మంది రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
నాకు రెండు ఎకరాల ఎవుసం భూమి ఉన్నది. కాకతీయ కాలువపైన ఆధారపడే సేద్యం చేస్తున్న. నాకే కాదు, మా ఇబ్రహీపట్నం మండలంలోని అనేక గ్రామాల రైతులకు కాకతీయ కాలువ నీరే ప్రధాన వనరు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి గడ్డు పరిస్థితి ఎదురైంది. కాలువలో అర్దగజం నీళ్లు లేవు. ఎస్సారెస్పీలోనూ డెడ్స్టోరేజే ఉన్నది. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే సూచనలు లేవు. వర్షాలు పడుత లేవు. బావుల్లోనూ నీళ్లు లేవు. ఏం చేయాలో అర్థం కాక ఇంత వరకు నేను నారు పోయలేదు. ఇంకో రెండుమూడు రోజులు గడిస్తే నార్లు పోసే టైం గడిచిపోతది. నార్లు లేటైతే నాట్లు లేటైతయి. సర్కారు సన్నవడ్లు పండించమంటది. అవన్ని ఐదునెలల కాలం పంటలు. నాట్లు ఆలస్యమైతే టైంకు పంట రాదు. అన్ని తిప్పలే అయితయి. ఏం చేయాలో అర్థమైతలేదు. సర్కారే ఆదుకోవాలే. పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీలో నీళ్లు ఎక్కియాలే. అట్లయితనే అందరికీ లాభం అయితది.