అగ్ర కథానాయకుడు నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా నాని నటిస్తున్న ‘జడల్’ పాత్రకు సంబంధించిన లుక్, ‘ఆయా షేర్’ సాంగ్, ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్న సినేరియా.. ఇవన్నీ సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచాయి. పైగా ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా కావడం కూడా ఈ అంచనాలకు ఓ కారణం. అయితే.. ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్న జాప్యం సినీ వర్గాల్లోనే కాక, సగటు ప్రేక్షకుల్లో కూడా చర్చనీయాంశమైంది.
ఈ సినిమాను మొదట్లో ఈ ఏడాది మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ 21కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మారినట్టు తెలుస్తున్నది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, ప్రచారానికి తగిన సమయం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ చిత్రం విడుదలను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్టు ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్రనటుడు మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్‌బాబు, ఈశ్వరీరావు ఇతర పాత్రధారులు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని సీఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.