ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని తిమ్మారెడ్డి పల్లి తండాలో తీవ్ర తాగు నీటి ఎద్దడి నెలకొంది. తండాలో నెలకొన్న తాగునీటి ( Drinking Water ) సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గిరిజన మహిళలు ( Tribal women ) ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి తండావాసులకు త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరుబావులను ఆశ్రయిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు త్రాగునీటి సమస్యను వివరించిన పట్టించుకోవడంలేదని గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పొలాల నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే మహిళలు, వృద్ధులు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నామని అన్నారు. కడివేడు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు.