2025 జూలై 26న డాక్టర్ టీవీ నారాయణ శత జయంతి
‘ఆత్మగౌరవమ్ము అఖిల సంపదలందు
గొప్పదంచు బుధులు చెప్పిరయ్య
కుదువబెట్టవద్దు పదవికోసము దాని
అవధరింపుమయ్య ఆర్షపుత్ర!’
అంటూ ఆత్మగౌరవానికున్న అత్యధిక ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు…
‘విఱ్ఱవీగవద్దు విజయమ్ము సిద్ధింప
నీల్గవద్దు కలిమి కలిగినపుడు
సర్వమిచ్చువాడు సర్వేశ్వరుండెగా’
అంటూ స్థిత ప్రజ్ఞత్వాన్ని ప్రబోధించిన ఆధునిక వేమన డాక్టర్ టీవీ నారాయణ. ఆయన 1925 జూలై 26న హైదరాబాద్లోని బొల్లారంలో తక్కెళ్ల నరసమాంబ-వెంకయ్య దంపతులకు జన్మించారు. నిరంతర అధ్యయనం, నిష్కళంక జీవన విధానాన్ని అలవర్చుకున్న టీవీ నారాయణ ఎంఏ; ఎంఈడీ; ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పట్టాలు పొందారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కాకతీయ వర్సిటీ గౌరవ డాక్టరేట్ (డి.లిట్) ప్రదానం చేసింది.
పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నారాయణ జిల్లా విద్యాధికారి నుంచి ఏపీ సర్వీస్ కమిషన్ సభ్యులు దాకాపలు హోదాలలో సమర్థవంతంగా పనిచేశారు. మూడు దశాబ్దాలకు పైగా విద్యాశాఖలో ఉత్తమ అధ్యాపకులుగా, ఉన్నత పరిపాలనాదక్షులుగా వేలమంది విద్యార్థులను ప్రత్యక్షంగా ప్రభావితం చేశారు.
‘పనిచెయ్! పనిచెయ్! పనిచెయ్!
దరిద్రుడవైనా, ధనికుడవైనా
పని చేయుటయే ప్రతిమానవునికి పరమావధి
సోమరితనమే భయ సందేహాలకు రహదారి’
అంటూ శ్రమ సంస్కృతిని ప్రబోధించే సిడ్నిహరీస్ ఆంగ్ల కవిత ‘వర్క్ వర్క్ వర్క్’ని త్రికరణశుద్ధిగా గౌరవించడమే కాదు, నిత్య జీవితాచరణగా నిరూపిస్తున్న కర్మయోగి డాక్టర్ టీవీ నారాయణ. ఊహ తెలిసినప్పటినుంచి ఆర్షగ్రంథాలపై, ఆర్య సమాజ సిద్ధాంతాలపై అభిమానం పెంచుకున్న నారాయణ ఓపిక ఉన్నంత కాలం తాను నమ్మిన ఆదర్శాల కోసం కృషిచేశారు. ఆదర్శాలకూ, ఆచరణకూ తేడా లేని వీరి జీవితం, ఉత్తమ సంస్కారం, ఉన్నత వ్యక్తిత్వం ఎందరినో ప్రభావితం చేసింది. నిరంతర గ్రంథాధ్యయనం వల్ల పెంపొందిన సాహిత్యాభిలాషతో హృదయం స్పందించినప్పుడల్లా కవిత్వం, పద్యాలు, వ్యాసాలు రాశారు. ఆయా సందర్భాలను పురస్కరించుకొని పత్రికల వారి విజ్ఞప్తి మేరకు ఆకాశవాణి వారి పిలుపు మేరకు నారాయణ రచనలు చేసి పంపేవారు. నూనూగు మీసాల నూతన యవ్వనవేళ సదాలక్ష్మితో ప్రేమలోపడిన నారాయణ హృదయాంతరాళం నుంచి వెలువడిన గీతాల సంపుటి ‘మిము వీడిన ఫలం’ పేరిట వెలువడింది. 1983 మార్చిలో వీరి తొలి కవితా సంపుటి ‘ఆత్మదర్శనం’ ప్రచురింపబడింది. 1987 అక్టోబర్లో ‘అమరవాక్సుధాస్రవంతి’ గ్రంథం అచ్చయింది.
సాంఘిక సమతావాదం, హేతువాద దృష్టి, సంఘసంస్కరణాభిలాష, ఆధ్యాత్మిక తత్వప్రబోధాల అభినివేశం కల డాక్టర్ టీవీ నారాయణ సహజంగానే వేమన పద్యాలతో బాగా ఆకర్షితులయ్యారు. తేటతెలుగులో ఆట వెలదులను రచించాలన్న కోరిక కలిగింది. ఒకనాడు ప్రార్థనానంతరం వీరు ఆలోచిస్తుండగా ‘అవధరింపుమయ్య ఆర్షపుత్రా!’ అన్న మకుటం స్ఫురించింది. ఈ మకుటంతో 108 పద్యాలు రచించిన నారాయణ ‘ఆర్షపుత్ర శతకం’ అటు పండితుల, ఇటు పామరుల ఆదరణను పొందింది.
‘ఆదరించిరట ఆదికాలము నుండి
ఆస్తికులను వోలె నాస్తికులను
పరిమళించెనిచట భావపుష్పములెన్నో
అవధరింపుమయ్య ఆర్షపుత్ర!’
అంటున్న డాక్టర్ నారాయణ అపారమైన శిష్యసంపదలో ఆస్తికులూ, నాస్తికులూ, హేతువాదులూ, భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులూ, ఆర్యసామాజికుల వంటి విభిన్న భావధారలవారున్నారు. ‘భవ్య చరిత శతకము’, ‘జీవనవేదం’, ‘శ్రుతిసౌరభము’ మొదలైన పద్య కదంబాలను ప్రకటించిన డాక్టర్ నారాయణ రేడియో ప్రసంగాలు ‘మహనీయుల మహితోక్తులు’ శీర్షికన వెలువడింది.
‘ది సౌండ్స్ ఆఫ్ టైం’ ఆంగ్ల పద్యకృతిని వీరు తమ తల్లికి అంకితమిచ్చారు. ఐదారు ఉపనిషత్తులను తేట తెలుగులోకి అనువదించారు. సామాజిక, సాహిత్య, తాత్విక, మనస్తత్వ, విద్యా సంబంధమైన విషయాలపై వందలాది వ్యాసాలను రచించిన నారాయణ రచనాశైలి సహజసుందరంగా, సరళంగా, చదివింపజేసేదిగా ఉంటుంది.
నిరుపమానమైన దేశభక్తి, సామాజిక న్యాయ చింతన, నిరాడంబర జీవన విధానం, శిష్యులపై ప్రసరించే గురువాత్సల్యం, క్రమశిక్షణతో కూడిన ఉదాత్త వ్యక్తిత్వం, సమసమాజ నిర్మాణకాంక్ష రూపుగట్టిన డాక్టర్ టీవీ నారాయణకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ వంటి అత్యున్నత పురస్కారం అందించింది. డాక్టర్ టీవీ నారాయణ ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకాలు, అనుసరణీయాలు.