మెట్పల్ల్లి/మారుతీనగర్, డిసెంబర్ 23 : విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి కేటాయించిన రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న పాఠశాల భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారిగా మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన దుస్థితిని ప్రస్తావించినట్టు గుర్తుచేశారు.
పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా ఒక్క పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావును కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేయగానే పెద్దమనసుతో వెంటనే రూ. 40 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించబోతున్న పాఠశాల భవనం మూడు నెలల్లో అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదుల నిర్మాణం కోసం ఎంపీ సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అడగగానే నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావుకు పాఠశాల విద్యార్థులు, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీ పేరు ప్రస్తావించగానే ఒక్కసారిగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చప్పట్లు, హర్షధ్వానాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యేను పాఠశాల తరఫున విద్యాధికారులు ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించి నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి నారాయణ, తహసీల్దార్ నీత, మున్సిపల్ కమిషనర్ మోహన్,ఎంఈవో చంద్రశేఖర్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ దేవారాం, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామానుజం తదితరులు పాల్గొన్నారు.