హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : చెక్‌డ్యామ్‌ల పేల్చివేతలు, నీటివనరుల విధ్వంసంపై వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, జల్ బిరాదరి చైర్మన్ డాక్టర్ రాజేంద్రసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణ కోసం జల్ బిరాదరి తరఫున పీపుల్స్ ఎంక్వయిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపైనే కాకుండా, నీటివనరుల సంరక్షణపై కూడా కమిషన్ పనిచేస్తుందని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లను ఇటీవల ఇసుక మాఫియా పేల్చివేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాజేంద్రసింగ్, పౌరసమాజ ప్రతినిధులు, నీటిరంగ నిపుణులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయా చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు.
అనంతరం మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నీటిరంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్‌తో కలిసి మీడియాతో రాజేంద్రసింగ్ మాట్లాడారు. వరదలతో చెక్‌డ్యామ్ ధ్వంసమైందనే వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇసుక మాఫియానే నీటివనరుల విధ్వంసానికి పాల్పడుతున్నదని తేల్చిచెప్పారు. స్థానిక రైతులతో మాట్లాడినప్పుడు అదే చెప్పారని, క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా చెక్‌డ్యామ్ విధ్వంసం మానవ ప్రేరేపిత చర్యగానే ఉన్నదని వెల్లడించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం చెక్‌డ్యామ్‌లను పేల్చివేసినట్టుగా ధ్రువీకరిస్తున్నారని, పోలీసులకు ఆ మేరకు ఫిర్యాదులు కూడా చేశారని రాజేంద్రసింగ్ తెలిపారు. గతంలోనూ మానేరుకు భారీ వరదలు వచ్చాయని, అప్పుడు కొట్టుకుపోని చెక్‌డ్యామ్, అదీ వరదలు లేని సమయంలో కొట్టుకుపోవడమేంటని ప్రశ్నించారు. వరదల వల్ల అది సాధ్యం కాదని, కచ్చితంగా పేల్చి వేస్తేనే సాధ్యమని తేల్చిచెప్పారు. అయినప్పటికీ చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజకీయ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతున్నదని పేర్కొన్నారు.
చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై జల్ బిరాదరి తరఫున సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పీపుల్స్ ఎంక్వయిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని రాజేంద్రసింగ్ వెల్లడించారు. చైర్మన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. కమిషన్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, ప్రజా నిఘా వేదిక నుంచి వీవీ రావు, మానేరు పరిరక్షణ సమితి నుంచి నోముల శ్రీనివాస్‌రెడ్డి, వాక్ ఫర్ వాటర్ నుంచి కరుణాకర్‌రెడ్డిని నియమించారు.
చెక్‌డ్యామ్‌ల విధ్వంసం వెనుక పాలకపక్షానికి చెందిన ఇసుక మాఫియా ఉన్నదని స్థానిక రైతులు తమతో చెప్పారని వీ ప్రకాశ్ పేర్కొన్నారు. చెక్‌డ్యామ్ పొడవు మొత్తం 737 మీటర్లు ఉంటే సుమారు 90 మీటర్ల మేర ధ్వంసమైందని, రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. స్థానిక, జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం నాణ్యతా లోపం వల్ల చెక్‌డ్యామ్‌లు వరదకు కొట్టుకుపోయాయని చెప్తున్నారని పేర్కొన్నారు. అయితే, వరదలు లేని సమయంలో డ్యామ్ ఎలా కొట్టుకుపోతుందని ప్రశ్నించారు. అడివిసోమన్పల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ ఈ నెల 17న ధ్వంసమైనట్టు తమ దృష్టికి వచ్చిందని, 20న అక్కడికి వెళ్లి పరిశీలించగా, అది కూడా పేల్చివేసినట్టు స్పష్టమైందని చెప్పారు. ఆ ప్రాంతం ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఇలాక కావడంతోపాటు కాంగ్రెస్ పెద్దల ‘హస్తం’ ఉన్నట్టు ఇక్కడి ప్రజలు అనుమానం వ్యక్తంచేశారని తెలిపారు.
వీ ప్రకాశ్ నేతృత్వంలో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ సైతం చెక్‌డ్యామ్‌ల పేల్చివేతలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపింది. తాజాగా అందుకు సంబంధించిన నివేదికను వెల్లడించింది. అదేవిధంగా ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టింది. సాగునీటి పారుదల శాఖ అధికారుల ఫిర్యాదు ఆధారంగా త్వరితగతిన విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఇసుక మాఫియా ఆగడాలను నిరోధించాలని, అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించాలని, మానేరులో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ తీర్పును అమలుచేయాలని, పేలుడు పదార్థాల వినియోగంపై నిఘా పెంచాలని కోరింది. తనుగుల, అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌లను వచ్చే వానకాలం నాటికి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాఘవరెడ్డి, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ దామోదర్‌రెడ్డి, శ్రీధర్‌రావుదేశ్‌పాండే, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మల్లావజుల విజయానంద్, సీనియర్ జర్నలిస్టులు పిట్టల రవీందర్, బుచ్చన్న, శంకర్‌తో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది.