GIS | సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) ; గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వేకు ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత ఎదురువుతున్నది. ‘ఇంటికి సంబంధించిన వివరాలు బల్దియా వద్ద ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం’.. మళ్లీ సమాచారం కావాలం’టూ.. రావడంపై ప్రజలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు సర్వే చేస్తున్నారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం, అనుమానాలను నివృత్తి చేయకపోవడంతో ప్రజలు సహకరించడం లేదు. సర్వేకు అడ్డంకులు వస్తుండటంతో నిర్ణీత గడువులోగా లక్ష్యం దాటడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి, అందరి ఆయోదం తర్వాతే సర్వే ప్రక్రియ చేపట్టాలని నిపుణులు చెబుతున్న మాట.
జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వే ప్రక్రియ ఈ ఏడాది జూలై 30న ప్రారంభించారు. ఈ జీఐఎస్ సర్వేకు జీహెచ్ఎంసీ దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో ప్రతి ఆస్తిని, నిర్మాణాన్ని, ఖాళీ ప్లాట్లను, నివాసాలను, వ్యాపార భవనాలను గుర్తించి.. మ్యాపింగ్ చేసేందుకు గరిష్ఠంగా 18 నెలల గడువు తీసుకుని 20 లక్షల ఆస్తులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గడిచిన మూడు నెలల్లో 15వేల ఆస్తులను మాత్రమే లెక్కించినట్టు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో కనీసం 15వేల ఆస్తుల గుర్తింపునకే పరిమితమైతే వచ్చే 15 నెలల్లో 20 లక్షల ఆస్తుల గుర్తింపు సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఈ సర్వేపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో ఈ ప్రక్రియ కేవలం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని ప్రాంతాల్లో సర్వే చేశారు..? ఎన్ని ఆస్తులను గుర్తించారు? డ్రోన్ సర్వేలు ఎక్కడెక్కడ చేశారు? ఇంటింటి సర్వేలు ఏ ప్రాంతాల్లో పూర్తి చేశారు..? అనేది గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.
ఇంటింటికీ డిజిటల్ డోర్ నంబర్లు
ఇంటింటికీ ప్రత్యేకంగా డిజిటల్ డోర్ నంబర్లు ఇస్తామని, దానిపై క్యూఆర్ కోడ్ వల్ల ఆ ఇంటికి లేదా వీధిలో ఎలాంటి సేవలు అందుతాయనే విషయాలు క్షణాల్లో తెలిసిపోతాయని చెప్పారు. డోర్ టు డోర్ సర్వేలో అవసరమైన సపోర్ట్ డాక్యుమెంట్లతో పాటు ప్రాపర్టీస్, యుటిలిటీస్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారని స్పష్టం చేశారు. కాగా, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సర్వేకు వచ్చిన అధికారులు, సిబ్బంది జీహెచ్ఎంసీకి సంబంధించిన వారేనా? లేదంటే ప్రైవేట్ వ్యక్తులా? అన్న కోణంలో కొందరు? సమగ్ర వివరాలు ఇస్తే ..ఆస్తిపన్ను భారం మరింత పడుతుందని మరికొందరు? జీహెచ్ఎంసీ వద్ద వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారని మరికొందరు సర్వేకు దూరంగా ఉంటున్నారు.
ఫిజికల్ సర్వేకు ప్రజలు దూరం
అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వేను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీఐఎస్తో బల్దియా మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డు చేస్తున్నామని, దీంతో ప్రభుత్వ భూములు, చిన్న, పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులు ఇలా సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు. డ్రోన్ సర్వే పూర్తయ్యాక ప్రతి అంశం మ్యాపింగ్ ఉంటుందని, తద్వారా వీధుల్లో విద్యుత్ దీపాల దగ్గరి నుంచి చెత్త సేకరణ వరకు ప్రతి అంశం జీహెచ్ఎంసీకి సమగ్ర వివరాలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆస్తిపన్ను మదింపులోనూ చాలా సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు.