న్యూయార్క్: రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఇది మంచి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అయితే దీనిపై సమగ్రమైన వివరాలు తెలియదన్నారు. ఇక ముందు రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా దిగుమతి చేసుకోదన్న వార్తలు వినిపించాయని, దాంట్లో ఎంత వాస్తవం ఉందో తనకు తెలియదని, ఒకవేళ అదే నిజమైతే అది మంచి నిర్ణయమని, దీనిపై పునరాలోచన చేస్తామని ట్రంప్ అన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం ఇండియాపై 25 శాతం పన్ను పడనున్నది. అయితే రష్యా నుంచి సైనిక వస్తువులు, ఇంధనాన్ని కొనుగోలు చేస్తే భారత్‌పై పెనాల్టీ వేస్తామని ట్రంప్ అన్నారు. కానీ ఎంత పెనాల్టీ కట్టాలన్న దానిపై ఆయన ఏమీ క్లారిటీ ఇవ్వలేదు.
రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై ఇటీవల విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ ను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లో అమలులో ఉన్న చమురు ధరల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ రష్యా నుంచి కొనుగోలు అంశంలో మాత్రం స్పష్టమైన సమాధానం ఆయన ఇవ్వలేకపోయారు.
ఇండియాతో వాణిజ్య లోటు ఉందని, భారత్ మిత్రదేశమే అయినా, చాన్నాళ్ల నుంచి ఆ దేశంతో తక్కువ వ్యాపారమే చేశామని ట్రం్ అన్నారు. ఎందుకంటే ఇండియాలో పన్నులు ఎక్కువ అని పేర్కొన్నారు. దీనికి తోడు రష్యా నుంచి భారీ స్థాయిలో మిలిటరీ ఎక్విప్మెంట్ను ఇండియా కొంటోందని, అందుకే ఆ దేశంపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నామని, ఇంకా అదనంగా పెనాల్టీ కూడా వేయనున్నట్లు ట్రంప్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్, రష్యా దేశాలది చచ్చుబడిన ఆర్థిక వ్యవస్థలని ట్రంప్ విమర్శించారు.