ముంబై, ఫిబ్రవరి 24 : దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. దీంతో మదుపరుల సంపద కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోతున్నది. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 856.65 పాయింట్లు లేదా 1.14 శాతం పతనమై 75వేల మార్కుకు దిగువన 74,454.41 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.4,22,983.08 కోట్లు హరించుకుపోయి రూ.3,97,97,305.47 కోట్ల (దాదాపు రూ.398 లక్షల కోట్లు) వద్ద నిలిచింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 242.55 పాయింట్లు లేదా 1.06 శాతం కోల్పోయి 22,553. 35 వద్ద నిలిచింది.
ఉదయం ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సమయం గడుస్తున్నకొద్దీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేశారు. దీంతో నష్టాలు మరింత పెరిగిపోయాయి. ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 923.62 పాయింట్లు దిగజారడం గమనార్హం. నిజానికి గత ఐదు రోజులుగా ఈక్విటీలు నేలచూపుల్నే చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1,542.45 పాయింట్లు, నిఫ్టీ 406.15 పాయింట్లు క్షీణించాయి. దీంతో ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా భారీగానే ఆవిరైపోతున్నది.
హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా తదితర ఐటీ రంగ షేర్లకు మదుపరులు దూరంగా ఉన్నారు. ఫలితంగా ఐటీ సూచీ 2.65 శాతం పడిపోయింది. జొమాటో, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లూ కోలుకోలేకపోయాయి. రంగాలవారీగా టెలికం 2.26 శాతం, మెటల్ 2.16 శాతం, కమోడిటీస్ 1.53 శాతం, యుటిలిటీస్ 1.42 శాతం కుప్పకూలాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.31 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.78 శాతం మేర నిరాశపర్చాయి.
భారతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా ఈక్విటీ నష్టాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ వంటి ఆసియా దేశాల సూచీలూ నిరాశపర్చాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) అదే పనిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా దెబ్బతీసింది.