Stock Market | ముంబై, మే 22 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. పెరిగిన అమెరికా బాండ్ ఈల్డ్స్ ఒకవైపు.. ఎగబాకుతున్న ఆ దేశ అప్పుల భారం మరోవైపు.. భారతీయ సూచీలను కుదిపేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 80,951.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 1,106.71 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం కోల్పోయి 24,609.70 వద్ద స్థిరపడింది.
ఎఫ్ఎంసీజీ (1.25 శాతం), ఐటీ (1.19 శాతం), చమురు-గ్యాస్ (1.13 శాతం), ఆటో (0.87 శాతం) రంగాల షేర్లు విపరీతంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.33 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.17 శాతం మేర దిగజారాయి. షేర్లవారీగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ షేర్లు నిరాశపర్చాయి. ఇక ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి.
అమెరికా బాండ్లు (5 శాతం), జపాన్ బాండ్ (3.5 శాతం) ఈల్డ్స్ భారీగా పెరగడం.. దేశ, విదేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో మదుపరులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడులనూ ప్రమాదంగా పరిగణించారు. దీంతో లాభాల స్వీకరణకు దిగారు.
అమెరికా అప్పుల భారం ఆందోళనకర స్థాయికి పెరుగుతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆ దేశ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ దిగజార్చడం సైతం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టించింది.