న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.8,501 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,033 కోట్ల లాభంతో పోలిస్తే 20.8 శాతం వృద్ధిని కనబరిచినట్టు సంస్థ వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం ఎగబాకి రూ.46,402 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
కిందటేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.40,925 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఈ నియామకాలను క్యాంపస్, ఇతర యూనివర్సిటీల నుంచి చేపట్టనున్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జయేశ్ సంఘరాజ్క తెలిపారు. మరోవైపు, గతేడాది నాలుగో త్రైమాసికంలో 8,400 మంది సిబ్బంది సంస్థ నుంచి వైదొలుగుడంతో మొత్తం సంఖ్య 3,28,594కి పడిపోయారు. గత త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు 12.6 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇది 12.3 శాతంగా ఉన్నది.
ఈ ఏడాది వృద్ధి 3.5 శాతం లోపే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో వృద్ధి 1.5 శాతం నుంచి 3.5 శాతం లోపు ఉంటుందని గైడెన్స్లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆర్థిక సేవలు, యుటిలిటీ, ఏఐ ఆధారిత సేవలకు డిమాండ్ ఉంటుందని కంపెనీ భావిస్తున్నది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో రాణించాం. 14.9 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే 3.1 శాతం వృద్ధి సాధ్యమైంది. నూతన టెక్నాలజీ ఏఐ పటిష్ఠతను, అలాగే భారీ పరివర్తనాత్మక అవకాశాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేశాయి. ఆరు విభాగాలకు ఏఐ సర్వీసులను విస్తరించడం కలిసొచ్చింది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ