గాంధారి/కురవి, నవంబర్ 28: గుండెపోటు వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తూ ఓ వైద్యుడు గుండెపోటుతోనే ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారం చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం టేకులతండాకు చెందిన డాక్టర్ ధరంసోత్ లక్ష్మణ్ (38) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీంతోపాటు గాంధారిలో ఓ ప్రైవేటు నర్సింగ్ హోం నిర్వహిస్తున్నారు.
ఆదివారం గాంధారి మండలం గుజ్జుల్తండాకు చెందిన జగ్గునాయక్ (60)కు గుండెపోటు రావడంతో, కుటుంబీకులు డాక్టర్ లక్ష్మణ్‌కు చెందిన నర్సింగ్ హోంకు తీసుకొచ్చారు. జగ్గునాయక్ను పరిశీలిస్తుండగా డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో మరణించారు. ఆ వెంటనే రోగి జగ్గు నాయక్ సైతం చనిపోయాడు. డాక్టర్ మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు స్వగ్రామానికి తరలించారు. వైద్యుడి మృతితో స్వగ్రామం టేకులతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్‌కు భార్య స్నేహలత, కుమార్తెలు దీక్షిణి, శ్రీజ ఉన్నారు.