UPI Credit Line | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. తమ తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కస్టమర్లకు ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్’ సౌకర్యాన్ని కల్పించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకూ అనుమతిచ్చింది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే యూపీఐపై క్రెడిట్ లైన్ సదుపాయం మొదలైంది. అయితే ఇప్పటిదాకా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లోనే ఆ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు చిన్నతరహా బ్యాంకులైన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకూ ఆర్బీఐ ఈ వీలు కల్పించింది. ఈ నిర్ణయం యూపీఐ యూజర్లకు మరింత కలిసి రానున్నది. త్వరలోనే ఇందుకు సంబంధించి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు విధివిధానాలను ఆర్బీఐ ప్రకటించనున్నది. కాగా, అసలు ఈ యూపీఐపై ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్’ అంటే ఏమిటి? ఎలా ఈ సౌకర్యాన్ని రుణగ్రహీతలు పొందవచ్చో తెలుసుకుందాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వివరాల ప్రకారం ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ’ అనేది ఆర్బీఐ విజన్‌కు అనుగుణంగా అభివృద్ధిపర్చిన ఓ సరికొత్త ఆర్థిక వెసులుబాటు. దీనిద్వారా బ్యాంకుల నుంచి వ్యక్తులు, వ్యాపారులు తక్షణ రుణాలను పొందవచ్చు. యూపీఐ ద్వారా లావాదేవీల కోసం ఈ రుణాలను వెంటనే వినియోగించుకోవచ్చు. అయితే యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకుంటే ముందు గా మీకు సేవింగ్స్ ఖాతా (యూపీఐ యాప్స్‌కు లింకై ఉన్న సేవింగ్స్ అకౌంట్) గల బ్యాంక్ నుంచి ఆమోదం పొందాలి. ఇందుకోసం ఓ అప్లికేషన్‌ను బ్యాంక్‌లో సమర్పించాలి. అప్పుడు బ్యాంక్ మీ అర్హత, ఆదాయం, క్రెడిట్ స్కోర్, రుణ చరిత్రను పరిశీలిస్తుంది. ఈ క్రమంలో ఆదాయం, గుర్తింపు, చిరునామా, ఇతరత్రా అవసరమైన డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత బ్యాంక్ ఆమోదిస్తే మీకు క్రెడిట్ లైన్ సౌకర్యం లభిస్తుంది. అవసరం ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎన్పీసీఐ వెబ్సైట్ ప్రకారం తొలుత గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూపీఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌లు ఉన్నైట్టెతే మళ్లీ ఏ డౌన్లోడ్లూ అవసరం లేదు. ఉదాహరణకు ఫోన్‌పేలోకి లాగిన్ అయిన తర్వాత పైన కుడివైపు చివర్లో కనిపించే రౌండ్ బాక్స్‌లో ఉన్న కొశ్చన్ మార్క్‌పై క్లిక్‌చేస్తే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్‌చేసి పేమెంట్స్ మెథడ్స్‌ను ఎంచుకోవాలి. అందులో మీకు యూపీఐ క్రెడిట్ లైన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకొంటే మీకు క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని కల్పించిన బ్యాంక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌చేసి పిన్ నెంబర్ ద్వారా పేమెంట్స్‌ను పూర్తి చేయవచ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే తదితర యాప్‌ల ద్వారా కూడా బై నౌ-పే లేటర్ సదుపాయాలు లభిస్తున్నాయి.
ఈ క్రెడిట్ లైన్ రీపేమెంట్స్.. బ్యాంకునుబట్టి ఒక్కో రకంగా ఉంటాయి. అలాగే మీ ఖాతాలో నగదు నిల్వలు లేకపోయినా రుణం ద్వారా మీ అవసరాలను యూపీఐ పేమెంట్స్‌తో చేసుకుంటున్నందున దీనికి వడ్డీరేట్లు కూడా ఎక్కువే ఉంటాయి. ఇక అప్రమత్తంగా లేకపోతే సైబర్ మోసాలకూ తావుంటుంది.