కృష్ణ కాలనీ, జూన్ 10 : బొగ్గు బావులమీద గులాబీ కండువాలు వేసుకున్న కార్మికులను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు బెదిరిస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లిలోని కేటీకే -5వ గని ఆవరణలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తన పేషీలో రోజువారీ కార్యక్రమాలు, వాహనాల ఖర్చుకు సింగరేణి సొమ్మును వాడుకోవచ్చు గానీ, సింగరేణిలోని ఆ ర్వో ప్లాంట్‌ను రిపేర్ చేయడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.
కేటీకే -5ఇైంక్లెన్ గనిలో మ్యాన్ రైడింగ్ సమస్యను పరిష్కరించి కూల్చిన షెడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ‘ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులారా.. ఖబడ్దార్ మీ కాలం ముగిసింది.. కార్మికులు మీపై తిరగబడి, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని హెచ్చరించారు. టీబీజీకేఎస్ కార్మికులకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పించిందని స్పష్టంచేశారు. ఈనెల 12న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్‌రావు హాజరవుతారని, కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.