దేవరకొండ రూరల్, జూన్ 10 : బావిలో పడి ఇద్దరు బాలురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జర్పుల తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని జర్పుల తండాకు చెందిన జర్పుల చంటి, పార్వతి కుమారుడు హర్షవర్ధ్దన్(12), జర్పుల సేవా, లైలా కుమారుడు బిట్టు (11) మధ్యాహ్నం నుంచి కన్పించకపోవటంతో గ్రామంలో గాలిస్తుండగా ఇద్దరి మృత దేహాలు ఊరి సమీపంలోని బావిలో కన్పించాయి. బావి నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.
మృతుల శరీరంపై కాలిన బొబ్బలు ఉండటంతో కరెంట్ షాక్కు గురై మృతి చెంది ఉంటారని, మృతుల తల్లిదండ్రులు బంధువులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై మృతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. విచారణలో మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలూ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని బాలుర మృత దేహాల వద్ద నివాళులర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు.