న్యూఢిల్లీ: ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలు పూర్తి వివక్షాపూరితంగా, ఏకపక్షంగా ఉన్నప్పుడు తప్పితే కోర్టులు విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కరోనా సమయంలో నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకాల కింద వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో కొంత మంది వేరే రాష్ర్టాల్లో కూడా పనిచేశారు. వేరే రాష్ర్టాల్లో పనిచేసిన వారికి ఎక్కువ మార్కులు ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని డివిజన్ బెంచ్ తప్పు పట్టింది. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లగా ధర్మాసనం కూడా రాజస్థాన్ హైకోర్టు బెంచ్ తీర్పును సమర్థించింది. ప్రభుత్వాలు విచక్షణతో తీసుకొన్న విధానపరమైన నిర్ణయాలపై కోర్టు జోక్యం తగదని పేర్కొన్నది.