మంచిర్యాల : మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సింగరేణి ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. పెడదారి పట్టకుండా సన్మార్గంలో కొనసాగాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణాలో డ్రగ్స్ మహమ్మారిని మొగ్గ దశలోనే తుంచి వేస్తామన్నారు.
యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉక్కు పాదంతో అణచి వేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామన్నారు.
జిల్లాలోని కళాశాలలు, రైల్వే స్టేషన్ లో, గ్రామాలలో రెక్కీ నిర్వహించాలని తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సులు మరెన్నో జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి వార్డు, గ్రామ, పట్టణ మున్సిపాలిటీ స్థాయిలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ వారికి అభినందనలు. పోలీస్ శాఖకు ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ ఎడ్ల మహేశ్, తదితరులు పాల్గొన్నారు.