హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి(ఈఆర్సీ) పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కమ్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఈ డిస్కమ్‌కు ఈఆర్సీ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంది. లైసెన్స్ జారీ చేయాలని కోరుతూ ఇటీవల రైతు డిస్కమ్ ఈఆర్సీకి దరఖాస్తు చేసింది. ఇదే విషయంపై పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రైతు డిస్కమ్‌తో ఉత్తర, దక్షిణ డిస్కంలను ప్రైవేటీకరించే ప్రమాదముందని, విద్యుత్తు పంపిణీలో ఫ్రాంచైజీ విధానానికి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని, కనుక లైసెన్స్ జారీ చేయవద్దని ఈఆర్సీని అభ్యర్థించారు.
రైతు డిస్కమ్ పిటిషన్‌పై ఈఆర్సీ ఈ నెల 28న బహిరంగ విచారణ జరుపనున్నది. ఈ విచారణలోనూ అభ్యంతరాలు తెలిపేందుకు నిపుణులు రెడీ అవుతున్నారు.రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల ఆర్థిక అస్థిరతకు సర్కార్ అనుసరిస్తున్న తీరే కారణమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఇతర వినియోగదారుల బకాయిలు పేరుకుపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. సగటు బిల్లింగ్ రేటు, సగటు సేవా వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసంతోనే డిస్కమ్ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పడం అత్యంత దారుణమని, ఇలా చెప్పడం కుట్రపూరితమని అంటున్నారు. ‘సర్కారు, ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే డిస్కమ్‌లు నష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కుతాయి. అసలు మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మూడో డిస్కమ్ ఏర్పాటు చేసినా బకాయిలు పేరుకుపోతే డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితేం మెరుగవదు’ అంటూ వాదనలు వినిపిస్తున్నారు.
రైతు డిస్కమ్ ఈఆర్సీకి సమర్పించిన పిటిషన్లో అన్ని వివరాలను పొందుపరచలేదని, ఈ డిస్కమ్‌పై ఇంకా అనేక సందేహాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విద్యుత్తు పంపిణీలో ఫ్రాంచైజీ మాడల్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ అడుగులేస్తున్నట్లు కనిపిస్తున్నదంటున్నారు. ఈఆర్సీకి రైతు డిస్కమ్ సమర్పించిన పిటిషన్లో 7-14 వరకు గల సెక్షన్లు ఫ్రాంచైజీ మాడల్‌కు అనుగుణంగా ఉన్నాయి. ఇది అతిపెద్ద ఉపద్రవం తెచ్చిపెట్టనుందని వాదనలు వినిపిస్తున్నారు. మహారాష్ట్రలో ఫ్రాంచైజీ మాడల్ అమలయ్యింది. ఈఆర్సీ దీనిపై ఆయా రాష్ర్టాల్లో అధ్యయనం చేసిన తర్వాతే రైతు డిస్కమ్‌లకు లైసెన్స్ జారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యుత్తు పంపిణీ వ్యవస్థను కేంద్రం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. డిస్కమ్‌ల కార్యకలాపాల్లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేకంగా రైతుల కోసం డిస్కమ్ ఏర్పాటు చేయడం ద్వారా లాభదాయకమైన వినియోగదారులు వేరు చేయబడతారు. ఆ తర్వాత డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు దారులు పరుస్తారు. ప్రభుత్వ డిస్కమ్‌లు, వినియోగదారుల హక్కులను హరించే ప్రయత్నమిది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు డిస్కమ్ అవసరం లేదు. ఈఆర్సీ ఈ పిటిషన్‌ను తిరస్కరించాలి.