మూడో డిస్కమ్ ఆరో వేలు.. దాని అవసరమే లేదంటున్న నిపుణులు
రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి(ఈఆర్సీ) పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కమ్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది.
- రైతు డిస్కమ్‌కు లైసెన్స్ జారీ చేయవద్దు
- ఈఆర్సీకి అభ్యంతరాల వెల్లువ
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి(ఈఆర్సీ) పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కమ్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఈ డిస్కమ్‌కు ఈఆర్సీ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంది. లైసెన్స్ జారీ చేయాలని కోరుతూ ఇటీవల రైతు డిస్కమ్ ఈఆర్సీకి దరఖాస్తు చేసింది. ఇదే విషయంపై పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రైతు డిస్కమ్‌తో ఉత్తర, దక్షిణ డిస్కంలను ప్రైవేటీకరించే ప్రమాదముందని, విద్యుత్తు పంపిణీలో ఫ్రాంచైజీ విధానానికి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని, కనుక లైసెన్స్ జారీ చేయవద్దని ఈఆర్సీని అభ్యర్థించారు.
రైతు డిస్కమ్ పిటిషన్‌పై ఈఆర్సీ ఈ నెల 28న బహిరంగ విచారణ జరుపనున్నది. ఈ విచారణలోనూ అభ్యంతరాలు తెలిపేందుకు నిపుణులు రెడీ అవుతున్నారు.రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల ఆర్థిక అస్థిరతకు సర్కార్ అనుసరిస్తున్న తీరే కారణమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఇతర వినియోగదారుల బకాయిలు పేరుకుపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. సగటు బిల్లింగ్ రేటు, సగటు సేవా వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసంతోనే డిస్కమ్ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పడం అత్యంత దారుణమని, ఇలా చెప్పడం కుట్రపూరితమని అంటున్నారు. ‘సర్కారు, ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే డిస్కమ్‌లు నష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కుతాయి. అసలు మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మూడో డిస్కమ్ ఏర్పాటు చేసినా బకాయిలు పేరుకుపోతే డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితేం మెరుగవదు’ అంటూ వాదనలు వినిపిస్తున్నారు.
ఫ్రాంచైజీ మాడల్ దిశగా అడగులు
రైతు డిస్కమ్ ఈఆర్సీకి సమర్పించిన పిటిషన్లో అన్ని వివరాలను పొందుపరచలేదని, ఈ డిస్కమ్‌పై ఇంకా అనేక సందేహాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విద్యుత్తు పంపిణీలో ఫ్రాంచైజీ మాడల్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ అడుగులేస్తున్నట్లు కనిపిస్తున్నదంటున్నారు. ఈఆర్సీకి రైతు డిస్కమ్ సమర్పించిన పిటిషన్లో 7-14 వరకు గల సెక్షన్లు ఫ్రాంచైజీ మాడల్‌కు అనుగుణంగా ఉన్నాయి. ఇది అతిపెద్ద ఉపద్రవం తెచ్చిపెట్టనుందని వాదనలు వినిపిస్తున్నారు. మహారాష్ట్రలో ఫ్రాంచైజీ మాడల్ అమలయ్యింది. ఈఆర్సీ దీనిపై ఆయా రాష్ర్టాల్లో అధ్యయనం చేసిన తర్వాతే రైతు డిస్కమ్‌లకు లైసెన్స్ జారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల అభ్యంతరాలివే..
- రైతు డిస్కమ్‌కు థర్మల్ విద్యుత్తు కేటాయించారు. ఇది రాత్రి సమయాల్లోనే దొరుకుతుంది. రైతులు రాత్రిపూట విద్యుత్ తక్కువగా వాడుతారు. ఇది మిగులు విద్యుత్‌కు కారణమవుతుంది. పవర్ ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తుంది. ఈ విద్యుత్‌కు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- 11 కేవీ ఫీడర్లను వేరుగా ఉంచడం అంత మంచిది కాదు. దీంతో ఎనర్జీ అకౌంటింగ్ సమస్యలొస్తాయి.
- వ్యవసాయానికి రోజంతా కరెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం 14-16 గంటలు మాత్రమే ఇస్తున్నారు. సంవత్సరంలో 180-200 రోజులు మాత్రమే విద్యుత్తు అవసరముంటుంది. పంట కోత, నాటు సమయాల్లో కరెంటు అవసరం తక్కువ. ఇది గ్రిడ్ సమతుల్యతపై ప్రభావం చూపుతుంది.
- వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు అధికంగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో సమస్యలెక్కువగా ఉత్పన్నమవుతాయి. మండలం మొత్తానికి ఇద్దరు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది ఎలా సరిపోతారు? రైతులు మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
- స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్ కోసం రూ.1,306 కోట్లు వెచ్చించడం భారమవుతుంది. పైగా నిర్వహణ, టీఅండ్‌డీ నష్టాలతో అధిక భారం పడుతుంది.
- కొత్త డిస్కమ్ ఇప్పటికే ఉన్న డిస్కమ్‌ల నెట్వర్క్ మీద ఆధారపడుతుంది. ఒక కేటగిరీ కస్టమర్లకు మాత్రమే సేవలందించడం సెక్షన్ 43కు విరుద్ధం.
- 30 శాతం ఈక్విటీ నెరవేర్చడం కష్టం. రైతు డిస్కమ్ సొంత నిధులు ప్రశ్నార్థకం.
డిస్కమ్‌లను ప్రైవేటీకరించే కుట్ర
విద్యుత్తు పంపిణీ వ్యవస్థను కేంద్రం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. డిస్కమ్‌ల కార్యకలాపాల్లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేకంగా రైతుల కోసం డిస్కమ్ ఏర్పాటు చేయడం ద్వారా లాభదాయకమైన వినియోగదారులు వేరు చేయబడతారు. ఆ తర్వాత డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు దారులు పరుస్తారు. ప్రభుత్వ డిస్కమ్‌లు, వినియోగదారుల హక్కులను హరించే ప్రయత్నమిది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు డిస్కమ్ అవసరం లేదు. ఈఆర్సీ ఈ పిటిషన్‌ను తిరస్కరించాలి.
– వేణుగోపాలరావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

