కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో 24గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తరు. కానీ, భగీరథ్ విషయంలో మూడు రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులకో చట్టం..? కేంద్రమంత్రి కొడుక్కో చట్టమా? ఈ విషయంలో సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదు. కేంద్రమంత్రి కొడుకు కావడం వల్లే మాట్లాడడం లేదు? మహిళకు కల్పించే భద్రత ఇదేనా? సంజయ్ కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలి. కేంద్ర మంత్రి పదవితోపాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి
– బీఆర్ఎస్ నాయకులు

కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం పోక్సో కేసు నమోదైనా ఇప్పటి వరకు భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రికి ఒక చట్టం.. సామాన్యులకు మరో చట్టం అన్నట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం నైతికత ఉన్నా.. సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని హితవు పలికారు. భగీరథ్ చేతిలో మోసపోయిన బాలికకు న్యాయం జరిగే వరకూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు సోమవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు తెలిపారు. కోరుట్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ర్యాలీ తీసి, ధర్నా చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి, బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో జిల్లా నాయకుడు దావ సురేశ్‌తోపాటు నాయకులు ధర్నా చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో కళ్లు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. బాలికకు న్యాయం చేయాలంటూ హోరెత్తించారు. వెంటనే సంజయ్‌ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ఉన్న పోస్టర్లను తెలంగాణచౌక్‌లోని ఐలాండ్‌కు అటించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని ఆ పోస్టర్లను చింపివేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ, భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, చీటి నర్సింగరావు విలేకరుల సమావేశంలో భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భగీరథ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం వేర్వేరుగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్ బీ గీతేకు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వరంలో ధర్నా చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలుచోట్ల విలేకరుల సమావేశాలు నిర్వహించి, నాయకులు మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కొడుకుపై పోక్సో కేసు నమోదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
బండి సంజయ్ కేంద్ర మంత్రికి, ఎంపీ స్థానానికి రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. బాలిక విషయంలో బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని ఆరోపించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయం అన్నారు. బేటీ పడావో.. బేటీ బాచావో అని నినాదం ఇచ్చే ప్రధాని మోడీ ఇప్పుడు తన మంత్రి వర్గంలోని ఓ మంత్రి కొడుకు చేష్టలకు ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ చేప్పే మహిళల భద్రత అంటే ఇదేనా? అని నిలదీశారు. వెంటనే భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని, బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మూడు రోజులైనా అరెస్ట్ చేయరా?

కోరుట్ల, మే 11: తన కొడుకు భగీరథ్ చేసిన నేరాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. దేశ ప్రజలను రక్షించాల్సిన నాయకుడే భక్షకుడిగా మారితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓ బాలికపై జరిగిన దుశ్చర్యను పార్టీలకతీతంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం కోరుట్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కల్లూరు రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం జాతీయ రహదారి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోక్సో కేసు నమోదు చేసిన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలని యాక్ట్ చెబుతున్నదని, మూడు రోజుల క్రితం భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా ఇప్పటి వరకు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
భగీరథ్ సంస్కారహీనుడిగా మారడానికి సంజయ్ మాట్లాడే భాష, ప్రవర్తనే కారణమని దుయ్యబట్టారు. బండి సంజయ్ తనకు ప్రాణ స్నేహితుడని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నాడని, కేసును తప్పు దారి పట్టించేందుకు సీఎం సహకరిస్తున్నాడని ఆరోపించారు. ప్రధాని మోడీ ఈ ఉదంతంపై పెదవి విప్పక పోవడం దారుణమని, సమాజం ఎటు పోతున్నదని ఆవేదన చెందారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు బండి సంజయ్‌ని నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, ఆర్బీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు పాల్గొన్నారు.