Divyanka Siroh | ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి 29 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డిగ్రీ పూర్తి చేసిన దివ్యాంక సిరోహి ప్రస్తుతం ఘజియాబాద్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. చిన్న స్థాయి నుండి కెరీర్ ప్రారంభించిన ఆమె, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రాంతాల్లో లోకల్ భాషల మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 50కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించిన ఆమె, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, హీరోయిన్గా ఎదగాలని కృషి చేస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. తరచూ తన ఫోటోలు, వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉండేది.
ఏప్రిల్ 21 మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందుకుంటూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దివ్యాంక సిరోహి మరణం ఉత్తరప్రదేశ్, హర్యానా సంగీత పరిశ్రమలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. యువ ప్రతిభావంతురాలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.
బాలీవుడ్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్న సమయంలోనే ఆమె ప్రయాణం ముగియడం నిజంగా విషాదకరం. నిన్న మధ్యాహ్నం ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, భారీగా అభిమానులు హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. దివ్యాంక సిరోహి ఇలా చిన్న వయస్సులో మృతి చెందడం ఆమె కుటుంబానికి, అభిమానులకు ఇది తీరని లోటుగా మిగిలిపోయింది.