సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ‘సార్… మన పోలీస్‌స్టేషన్ ఏ కమిషనరేట్లోకి వస్తుంది.. అరే భాయ్.. మా పోలీస్‌స్టేషన్ ఏ కమిషనరేట్‌లో వస్తుందో మాకే క్లారిటీ లేదు.. మీకెట్ల చెప్పాలే… కాగితాలపై కమిషనరేట్లు ఏర్పడుతున్నాయి.. కమిషనర్ల నియామకమవుతున్నది. కమిషనరేట్ అంటూ బ్యానర్లు పెట్టి అధికారులు బాధ్యతలు తీసుకుంటున్నారు.. గంటల వ్యవధులోనే కొత్త కమిషనరేట్లు ఏర్పడుతున్నాయి.. కొత్త జోన్లు ఏర్పడుతున్నాయి.. మా అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇంకా ఏం మార్పులోస్తాయో… ఏమో మాకేం తెలుస్తది… మేం ఎక్కడేసినా పనిచేయాలి… కమిషనరేట్లతో మాకేం పని భాయ్ మమ్మల్ని అడుగుతారం’టూ కొందరు అధికారుల సామాన్య ప్రజలతో మాట్లాడుతున్న మాటలివి.
జీహెచ్ఎంసీ పునర్విభజన… పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనలు చకచకా జరిగిపోవడంతో ఇప్పుడు పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలలో పునర్విభజన విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఔటర్ లోపల అంతా ఒకే యూనిట్‌గా జీహెచ్ఎంసీలా పోలీసులను కూడా విభజిస్తున్నారంటే.. అలాగే ఒకే పోలీస్ కమిషనరేట్ చేసి.. అన్ని ప్రాంతాల్లో జోన్లుగా చేయాల్సింది.. కానీ ఔటర్లో మూడు కమిషనరేట్లు ఎందుకు మరి అంటూ.. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా దీనిపై చర్చిస్తున్నారు. పునర్విభజన, కొత్త కమిషనరేట్ ఏర్పాతో ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేసే ఏఎస్సై నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు పదోన్నతులు, ఇతరాత్రా అంశాల్లో మానసిక ఆందోళనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా ఔటర్ లోపలి భాగాన్ని విడగొట్టేస్తూ ఏమి చేయాలనుకుంటుందంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనపై ఒక రోజు అధికారులు మాట్లాడారు..మరుసటి రోజు ఏకంగా కొత్తగా ప్యూచర్లేని ప్యూచర్ సిటీ పేరుతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ దానికి అదనపు డీజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాచకొండ కమిషనరేట్ పేరును రద్దు చేసి, మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చేసి దానికి ఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించింది సర్కారు. ఈ రెండు కమిషనరేట్లలో బ్యానర్లలోనే కమిషనరేట్ పేర్లు కన్పిస్తున్నాయి. ప్యూచర్ సిటీ కమిషనర్‌గా అదనపు డీజీ సుధీర్‌బాబు బాధ్యతలు తీసుకున్నారు.
అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో ఫ్యూచర్ సిటీ అంటూ రాసిన బ్యానర్ ఆయన వెనకాల కనిపించింది. అలాగే మల్కాజిగిరి కమిషనరేట్ అంటూ పాత రాచకండ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఇలా ఎవరో తరుముకొస్తున్నట్లు కొత్త కమిషనరేట్ ఏర్పాట్లు చేసి బ్యానర్లపై ఆయా కమిషనరేట్ల పేర్లను రాసి అధికారులను అక్కడకు పంపించడం ఇప్పటి వరకు ఎక్కడ కూడా అలా జరిగి ఉండదని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బ్యానర్లలోనే కమిషనరేట్ కార్యాలయాలు ఏర్పాటయ్యాయంటూ సిబ్బంది సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రణాళిక లేకుండా కమిషనరేట్ల పునర్విభజన జరిగిందంటూ కిందిస్థాయి సిబ్బంది ప్రభుత్వ నిర్ణయంపై రగిలిపోతున్నారు.