న్యూఢిల్లీ, జనవరి 1: పొగాకు,పాన్ మాసాలా ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్నది. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లకు అదనంగా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, హెల్త్ సెస్సును కేంద్రం విధించడంతో ఈ కొత్త పన్ను విధానం అమలు కానున్నది. హానికర వస్తువులుగా పరిగణించే ఈ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న నష్టపరిహార సెస్సు స్థానాన్ని కొత్త పన్ను విధానం భర్తీ చేస్తుంది.
పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం పడనుండగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు పడనున్నది. ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, తదితర అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ కింద 40 శాతం పన్ను ఉంటుంది. బీడీలపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. ఈ జీఎస్టీ రేట్లు కొనసాగిస్తూ విడిగా అదనపు లెవీలను విధిస్తారు. తాజా నిర్ణయం నేపథ్యంలో సిగరెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది.