అవినీతిపై నమస్తే తెలంగాణ ‘కథన’శంఖం పూరించింది. అధికారం అండతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న అక్రమార్కుల బండారాన్ని ఆధారాలు సహా ప్రజలముందు ఉంచింది. హెచ్‌సీయూ నుంచి హిల్ట్ పీ దాకా.. గ్రీన్‌ఫీల్డ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు.. సంచలన విషయాలను బయటపెట్టింది నమస్తే తెలంగాణ. గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చిన జీవోల గుట్టును, కీలకమైన డాక్యుమెంట్లను ప్రచురించింది. ‘బిగ్’ బ్రదర్స్, ఫార్మా బాధిత గ్రామాల్లో సాగిస్తున్న దౌర్జన్యకాండను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పింది. ముఖ్యనేత, అసలు కాంగ్రెస్-వలస కాంగ్రెస్ .. ఇట్లాంటి ఎన్నో పదాలను ‘నమస్తే తెలంగాణ’ కాయిన్ చేసింది. సాగునీటి ప్రాజెక్టులపై నమస్తే వెలువరించిన కథనాలకు లెక్కేలేదు. ఇసుక దోపిడీ మొదలు అడవుల ఆక్రమణ వరకు ఏ విషయాన్నీ వదల్లేదు.. కబ్జాకోరులు ఎవరైనా ఉపేక్షించలేదు.
హెచ్‌సీయూ ల్యాండ్‌స్కామ్ గుట్టు రట్టు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి అడవిని వందలాది జేసీబీలు పెట్టి ఎందుకు నరకాల్సి వచ్చింది? విద్యార్థులు, పౌరసమాజం తప్పుపడుతున్నా.. న్యాయస్థానం మందలించినా.. ఆగకుండా ధ్వంసరచన సాగించిందెందుకు? విలువైన ఆ భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేసిన బండారాన్ని, దాని భూమిని ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు దళారులతో డీల్ మాట్లాడుకున్న వైనాన్ని, టీజీఐఐసీ పేరిట ఆడిన డ్రామాను ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించింది నమస్తే తెలంగాణ. సర్కారులో సెగ పుట్టించింది.
ఇసుక దోపిడీపై..
ఒకవైపు ప్రాజెక్టులను ఎండబెట్టి, మరోవైపు ఇసుకదొపిడీకి అధికార పార్టీ పెద్దలు తెరలేపారు. మేడిగడ్డ బరాజ్ కింద బారులు తీరిన టిప్పర్లు, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇసుక రవాణా, ఆంధ్రాకు అక్రమంగా తరలింపు అన్నింటిపైనా ‘నమస్తే తెలంగాణ’ కలం ఝులిపించింది. హల్దీ వాగులో ఏకంగా వెలిసిన తోడేళ్ల తొవ్వ గురించి, కాగ్నా నదిని చెరపట్టిన అక్రమార్కుల గురించి ఫొటోలు సహా బయటపెట్టింది.
పాలసీ పన్నాగంపై కలం పోటు

9వేల ఎకరాల పారిశ్రామిక భూములను కమర్షియల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఎలా దొడ్డిదారిన ప్రయత్నిస్తున్నదో, వాటి అమ్మకంతోపాటు, పెద్దఎత్తున అవినీతికి కొందరు పెద్దలు ఎలా ప్లాన్ చేశారో ‘నమస్తే తెలంగాణ’ బ్రేక్ చేసింది. లోపభూయిష్టమైన హిల్ట్ పాలసీపై వరుస కథనాలు ప్రచురించింది. గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చిన రహస్య జీవోలను బయటపెట్టింది. చాపకింద నీరులా భూములు అమ్ముకోవాలన్న ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని తుత్తునియలు చేసి.. దాన్ని ప్రజాసమస్యగా మలచగలిగింది.
కబేళాకు గోవులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే వేములవాడ ఆలయం చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పదులసంఖ్యలో రాజన్న గోవులు మృత్యువాత పడటం 2025లో ఓ విషాదం. మరోవైపు ఆలయ గోవులను రైతుల ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలకు పంచడం, వాళ్లు కబేళాలకు అమ్ముకోవడాన్ని నమస్తే తెలంగాణ బయటపెట్టింది. మంత్రి అనుచరుల ప్రమేయాన్ని ససాక్ష్యంగా ప్రచురించింది. సీఎం పర్యటన సందర్భంగా ప్లేటు భోజనానికి 32వేల ప్రజాధనాన్ని ఖర్చుచేసిన ఉదందాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది.
మూసీ.. మెయిన్‌హార్ట్
పేదల సంగతి తేల్చకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా మూసీ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని పత్రిక ద్వారా ప్రశ్నించిన నమస్తే తెలంగాణ.. ప్రాజెక్టు వెనుక దాక్కుని ఉన్న రియల్ ఎస్టేట్ వ్యూహాలను బయటపెట్టించింది. బాబు పాత దోస్తు, సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌ను అడ్డుపెట్టుకుని ప్రపంచబ్యాంకు ముసుగేసుకుని సాగించిన డ్రామాలను వెల్లడించింది. మెయిన్‌హార్ట్ అనబడే పాకిస్థాన్ మూలాలున్న దివాళా కంపెనీని ముందుపెట్టి వేసిన పన్నాగాలను నమస్తే తెలంగాణ వరుస కథనాలతో వివరించింది.
ఫ్యూచర్‌సిటీ పేరిట భూదందా
ఫార్మాభూములను మళ్లించి, ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్నది. అయితే దాని విపరీతమైన ప్రమోషన్ వెనుక భూదందా సాగుతున్నదని, అమరావతి తరహాలో ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. సమీప గ్రామాల్లో బెదిరించి, భయపెట్టి బిగ్‌బ్రదర్స్ ఎట్లా రైతుల భూములు, అసైన్డ్ స్థలాలను తక్కువ ధరకు చేజిక్కించుకుంటున్న ఆధారాలు బయటపెట్టింది. ఆ భూదందాపై సుమారు వందకు పైగా ప్రత్యేక కథనాలను నమస్తే తెలంగాణ ప్రచురించింది.
భూ కబ్జాల బండారం
ఒకవైపు రియల్ఎస్టేట్ పతనమవడం, మరోవైపు అధికార పక్షం నేతలు యథేచ్ఛగా భూముల ఆక్రమణలకు పాల్పడటం నిత్యకృత్యమైంది. విలువైన హైదరాబాద్ పరిసర భూముల నుంచి, జిల్లాకేంద్రాల వరకు కబ్జాల పరంపరను పత్రికల్లో కథనాలుగా మలిచింది నమస్తే తెలంగాణ. తనయుడితో కలిసి బాంబుల మంత్రి సాగించిన దౌర్జన్యకాండను బయటపెట్టింది. అటవీ భూములు, అసైన్డ్ భూములనూ వదలని కబ్జాకోరుల బండారాన్ని బయటపెట్టింది.
పెద్దలకు అనువుగా ట్రిపుల్ఆర్!
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. అనేక గ్రామాల్లో రైతుల భూముల మీదుగా దాన్ని మళ్లించింది. పలువురు అధికార పార్టీ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా రింగ్ రోడ్డును మెలికలు తిప్పింది. వందలాది గ్రామాల రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చింది. ఏ ఏ పెద్దల కోసం, అధికారపార్టీ అనుయాయుల భూముల కోసం రింగురోడ్డును పేదలవైపు మలిపారో.. ఆ వివరాలతో సర్వేనెంబర్లు సహా నమస్తే తెలంగాణ వరుస కథనాలు వెలువరించింది.
సుంకిశాల గోడ.. ‘బ్రేకింగ్’ న్యూస్
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఉదంతాన్ని ప్రభుత్వం, అధికార యంత్రాంగం తొక్కిపెట్టినా.. దాన్ని బయట ప్రపంచానికి ఫొటోలు సహా వెల్లడించింది నమస్తే తెలంగాణ. నిత్యం కాళేశ్వరంపై నిందలేసే ప్రభుత్వ పెద్దలు గోడ కూడా సరిగా కట్టలేదనే వాస్తవాన్ని అది తేటతెల్లం చేసింది.
సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య ఉదంతంలో రేవంత్ కుటుంబసభ్యులపైనే నేరుగా ఆరోణలు వచ్చాయి. ఆ ఉదంతంలో ‘నమస్తే తెలంగాణ’ బృందం సాహసం చేసింది. అనేక నిర్బంధాలను తప్పించుకుని గ్రామానికి చేరిన నమస్తే తెలంగాణ.. ప్రతినిధులు సాయిరెడ్డి అంతిమయాత్రకూ అనుమతించని విషయాన్ని బయటపెట్టింది. మనిషి కూడా సరిగా దూరలేని సందులో నుంచి భౌతికకాయాన్ని తీసుకెళ్తుండటాన్ని ఫొటో తీసి ప్రచురించింది.