‘ఓటీటీలంటే ఇంట్లో కూర్చుని వినోదం చూడటమనుకుంటిరా? కాదు.. ఇంట్లోనే ఉండి ఎక్కడెక్కడి లొకేషన్లు ఎలా ఉన్నాయో చూసుకొని, అక్కడికి బయలెల్లి పోవడం!’ అంటున్నది జెన్ జీ. స్మార్ట్‌ఫోన్‌లో లేనిది లేదు. ఇంటర్నెట్ డేటా ఉంటే చాలు. ప్రపంచమంతా చూసి రావొచ్చని అనుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్న జెన్ జీ ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఓటీటీ యుగంలో కొత్తకొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ ఆనందించడమే కాదు.. ఆ సినిమాలు, సిరీస్‌లలో కనిపించే అందమైన లొకేషన్లను అనుభూతి చెందాలని బయలెల్లుతున్నారు. ఈ ఏడాది జెన్ జీ ప్రయాణాల్లో ఓటీటీ అందాల కోసం సాగినవే ఎక్కువగా ఉన్నాయట!
తగ్గేదే ల్యా అంటున్న జెన్ జీ ఆలోచనల్ని ఏఐ ఆధారంగా పనిచేసే ట్రావెల్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో విశ్లేషించి చెప్పిన నిజమిది. ఇక్సిగో ఈ ఏడాది కాలంలో జరిగిన ట్రావెలర్స్ ప్రయాణ గమ్యాలను విశ్లేషించింది. ఈశాన్య భారతదేశంలోని పట్టణాలు, ప్రకృతి దర్శనీయ ప్రదేశాలకు పర్యాటకుల పెరుగుదలను గణాంకాలతో సహా చూపుతూ ఓటీటీ ప్లాట్ఫామ్లో విజయవంతమైన సిరీస్‌లకు ఆ ప్రదేశాలకు ఉన్న సంబంధాన్ని గుర్తుచేసింది. ద ఫ్యామిలీ మ్యాన్ (సీజన్ 3), పాతాళ్ లోక్ (సీజన్ 2), ఢిల్లీ క్రైమ్ (సీజన్ 3)లకు ఉన్న ఆదరణతో దిమాపూర్ (నాగాలాండ్)కి 77 శాతం, అగర్తల (త్రిపుర)కు 48 శాతం, గువహతి (అస్సాం) 44 శాతం, ఇంపాల్ (మణిపూర్) 44 శాతం, ఈటానగర్ (అరుణాచల్ ప్రదేశ్) 42 శాతం మంది పర్యాటకులు గతేడాది కంటే పెరిగారు.
వీటితోపాటు డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్ చూసేందుకు ఎక్కువమంది పోయి వస్తున్నారట. విశాలమైన మైదానాలు, దట్టమైన అడవులు, పారే సెలయేళ్లు, సాంస్కృతిక వైవిధ్యంతోపాటు కొత్త ప్రపంచంలా కనిపించే ఈశాన్య రాష్ర్టాల లొకేషన్లను ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు డైరెక్టర్లు ఎంచుకుంటే, డైరెక్టుగా అక్కడికి పోయి కొత్త ఆనందాలను ఆస్వాదిస్తున్నారు! ఈ ట్రెండ్‌కి తగ్గట్టే ఆన్లైన్ ట్రావెల్ సంస్థలూ లొకేషన్లు, అందుకు తగ్గట్టు ప్యాకేజీలు చూపిస్తూ సర్వీసులు అందిస్తున్నాయి కూడా.