కామారెడ్డి : రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీని కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆశ వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్స్ పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
వారు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆశలు జీతం కోసం గతంలో పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి.
కేసీఆర్ మాత్రం ఆశల మనసు తెలుసుకొని జీతాలను రు. 9,750 కి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.1500 మాత్రమే ఉంటే.. ఇప్పుడు జీతం రు. 9,750 కి చేరింది.
ఏడేండ్లలో ఎంత పెరిగిందో ఆలోచించాలన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశ వర్కర్లకు ఇచ్చేది 4వేలు అయితే.. మన దగ్గర ఇస్తున్నది 9,750.
మరో బీజేపీ రాష్ట్రం మధ్య ప్రదేశ్లో ఇస్తున్నది రూ.3,000, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ రూ. 3,000లుగా ఉందన్నారు. గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేది.
కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నది. మీ పని తీరుతో ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలని మంత్రి సూచించారు. ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆశలది కీలక పాత్ర అన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది.
మోదీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని గుర్తు చేశారు. మనం మూడు నుంచి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామన్నారు. కష్ట పడితే కడుపుల పెట్టుకొని కాపాడుకుంటం. పని చేయకుంటే కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.