shabbir ali | మాచారెడ్డి : రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో ఆయన సోమవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
దళిత కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న షబ్బీర్ అలీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పేదలు సన్నబియ్యం తినాలనే లక్షంతోనే సన్నబియ్యం పథకం ప్రారంభించినట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు, డీలర్లను హెచ్చరించారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పేదలందరినీ లబ్ధిదారులుగా నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మాచారెడ్డి మాజీ ఎంపీపీ నరసింగారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నౌసిలాలు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.