హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు వైఖరి కొనసాగుతూనే ఉన్నది. ‘ముద్ర’ రుణాల మంజూరులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులను ఆదుకొనేందుకు 2015లో ప్రారంభించిన ఈ పథకాన్ని.. కేవలం బీజేపీ పాలిత, ఎన్డీయే అనుకూల రాష్ర్టాలకే ఎక్కువగా వర్తింపజేస్తున్నది. తాజాగా విడుదల చేసిన గణాంకాలే అందుకు ఉదాహరణ. గత ఏడాది మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సగటున 21.57 శాతం మందికి ముద్ర రుణాలు ఇవ్వగా, తెలంగాణలో 12.27 శాతం మందికే సాయం అందింది. అంటే జాతీయ సగటు కన్నా 10 శాతం తక్కువ.
ఆరేండ్లలో ముద్ర రుణాల పంపిణీని పరిశీలిస్తే బీజేపీ పాలిత కర్ణాటక, త్రిపుర, పుదుచ్చేరి టాప్-3లో నిలిచాయి. పుదుచ్చేరిలో ఏకంగా 55.97 శాతం మందికి రుణాలు మంజూరు చేశారు. అంటే జనాభాలో సగం మందికిపైగా పంపిణీ చేశారు. త్రిపుర, కర్ణాటకలోనూ దాదాపు సగం జనాభాకు ‘ముద్ర’ మంజూరైంది. తెలంగాణతో పోల్చితే ఈ మూడు రాష్ర్టాలకు సగటున 4 రెట్లు అధికంగా రుణాలు అందాయి. కేంద్రానికి అనుకూలంగా ఉండే ఒడిశాకు సైతం 43 శాతం రుణాలు అందటం గమనార్హం. తెలంగాణలో ఎంత ప్రయత్నించినా బీజేపీ పెద్దగా పుంజుకోవటం లేదు. కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ‘ముద్ర’ సాయాన్ని కేంద్రం తగ్గించినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో లబ్ధి కోసం బీజేపీ ముద్ర రుణాలను వాడుకొన్నది. గెలవటం లేదా పార్టీ బలపడే అవకాశం ఉన్న రాష్ర్టాలకు విరివిగా రుణాలు మంజూరు చేసింది. ఇందుకు తమిళనాడే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రాష్ట్రంలో ఏకంగా 45.56 శాతం మందికి రుణాలు మంజూరయ్యాయి. అక్కడ గతంలో బీజేపీ అనుకూల అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిపించటం కోసం ‘ముద్ర’ను అస్త్రంగా వినియోగించింది. పశ్చిమబెంగాల్ (29.76), కేరళ (27.98), జార్ఖండ్ (20.56), పంజాబ్ (19.04) రాష్ర్టాలకు సైతం ఎన్నికల కోణంలోనే రుణాలు మంజూరు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
