మేడ్చల్ : క్రమ శిక్షణ (Discipline) , పట్టుదల విజయానికి సోపానాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ( MLA Mallareddy ) అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇంజినీరింగ్లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీరింగ్ ( Engineering ) చేరిన మొదటి రోజు నుంచే కష్టపడి చదవడం అలవర్చుకోవాలన్నారు. క్రమ శిక్షణతో పట్టుదలగా కృషి చేస్తే విజయం సాధించడం కష్టమేమికాదన్నారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యను తపస్సులా ఆచరిస్తే భావి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడవచ్చన్నారు.
ప్రధానంగా చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే మార్కులే కాకుండా నైపుణ్యాలను కూడా అవసరమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు శ్రమించాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ యాజమాన్య కమిటీ సభ్యులు భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి, వీసీ వీఎస్కే రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిండ్రులు పాల్గొన్నారు.