లక్నో : పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఓ విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన లక్నోలోని అలంబాగ్ మెట్రోస్టేషన్‌లోని లిఫ్ట్‌లో మంగళవారం చోటు చేసుకున్నది. ఆ తర్వాత విద్యార్థి పరుగెత్తుకుంటూ వెళ్లి విషయాన్ని సోదరికి చెప్పింది. ఆమె నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అలంబాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని హుస్సేన్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నది. రోజూ మెట్రో రైలులో వెళ్లి వస్తుండగా.. స్టేషన్ వద్దకు బాధితురాలి అక్క వెళ్లి తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థిని ఎప్పటిలాగే రైలు దిగి.. మెట్రోస్టేషన్‌లోని లిఫ్ట్ ఎక్కింది. అదే సమయంలో 40-45 సంవత్సరాలున్న వ్యక్తి సైతం ఎక్కాడు. లిఫ్ట్ డోర్ మూతపడగా.. సదరు వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు తెరుచుకోగానే బాలిక అతన్ని తోసేసి బయటకు పరుగులు పెట్టింది. స్టేషన్ వద్ద ఉన్న సోదరికి విషయం మొత్తం వివరించింది. ఆమె నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. బాధితురాలి సోదరి తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం బాలిక పాఠశాలకు వెళ్లనని చెబుతోందని, భయాందోళనకు గురవుతుందని బాధురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అలంబాగ్ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితుడిని కోసం గాలిస్తున్నారు. మెట్రోస్టేషన్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని లక్నో మెట్రో కార్పోరేషన్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. అదే సమయంలో లిఫ్ట్‌లో సీసీ కెమెరా కనిపించడం లేదని సమాచారం. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తున్నది.